హిందుత్వని విడిచిపెట్టను | Will never dump Hindutva, says Maharashtra CM Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

హిందుత్వని విడిచిపెట్టను

Published Mon, Dec 2 2019 1:24 AM | Last Updated on Mon, Dec 2 2019 8:33 AM

Will never dump Hindutva, says Maharashtra CM Uddhav Thackeray - Sakshi

స్పీకర్‌ పటోలెతో కలిసి అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై: హిందుత్వ ఎజెండాను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు. ‘‘హిందుత్వ భావజాలాన్ని నేను విడిచిపెట్టలేను. నా నుంచి ఎవరూ దానిని దూరం చేయలేరు‘‘అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రెండు, మూడు రోజుల్లోనే ఠాక్రే అసెంబ్లీ సాక్షిగా హిందూత్వపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘హిందు త్వని నిన్న అనుసరించాను. ఇవాళ అనుసరిస్తున్నాను. రేపు కూడా అనుసరిస్తాను’అని చెప్పారు.  

అర్ధరాత్రి ఏమీ చెయ్యను  
ఫడ్నవీస్‌పై కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఠాక్రే ప్రసంగం సాగింది. ఎన్నికలకు ముందు ఫడ్నవీస్‌ మళ్లీ నేనే వస్తా అన్న నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ‘నేను ఎప్పుడూ మళ్లీ వస్తానని చెప్పలేదు. కానీ ఈ సభకు వచ్చాను. మహారాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను ఒక హామీ ఇస్తున్నాను. రాత్రికి రాత్రి ఏమీ చెయ్యను’ అంటూ ఫడ్నవీస్‌పై సెటైర్లు వేశారు. బీజేపీ–శివసేన మధ్య చీలికలు తేవడానికి ఫడ్నవీస్‌ ప్రయత్నించి ఉండకపోతే, తాను సీఎంగా గద్దెనెక్కేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్‌ 25 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని, ఎప్పటికీ స్నేహితుడిగానే ఉంటారని చెప్పారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు.



స్పీకర్‌గా రైతు బిడ్డ
మహారాష్ట్ర అసెంబ్లీలో అనూహ్యంగా బీజేపీ స్పీకర్‌ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్‌ కఠోర్‌ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ వాల్సె పాటిల్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, మరికొందరు సీనియర్‌ ఎమ్మెల్యేలు పటోలెను సాదరంగా తోడ్కొని వచ్చి స్పీకర్‌ చైర్‌లో కూర్చోబెట్టారు. ఒకప్పుడు రైతు నాయకుడిగా పటోలె విశిష్టమైన సేవలు అందించారు.

రైతు గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి స్పీకర్‌ పదవిని అందుకోవడం హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు. నానా పటోలె 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో విభేదాల కారణంగా 2017లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. విదర్భ ప్రాంతంలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటోలె ఇటీవల ఎన్నికయ్యారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement