మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫొటోగ్రఫీపై మంచి అభిరుచి కలిగిన ఉద్ధవ్ ప్రస్థానం ఆసక్తికరం. తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి, ఓనమాలు నేర్చుకున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు. మరాఠా పులి బాలాసాహెబ్ బాల్ ఠాక్రే–మీనా ఠాక్రే ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే 1960 జూలై 27న జన్మించారు. ముంబైలో బాలమోహన్ విద్యామందిర్‌లో పాఠశాల విద్య అభ్యసించారు.
‘సర్ జె.జె.ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్’లో ఫొటోగ్రఫీ ప్రధాన సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002లో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యుడిగా సేవలందించారు. ఈ ఎన్నికల్లో శివసేన మెరుగైన ఫలితాలు సాధించడంతో పార్టీలో ఉద్ధవ్ ప్రతిష్ట పెరిగింది. 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2006లో పార్టీ పత్రిక ‘సామ్నా’ చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో రాజీనామా చేశారు.
మోస్టు పాపులర్ సీఎం
2012లో బాల్ ఠాక్రే మరణించడంతో, 2013లో శివసేన అధినేతగా ఉద్ధవ్ ఠాక్రే పగ్గాలు చేపట్టారు. ఉద్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్రలో 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు.
మహా వికాస్ అఘాడీ పేరిట మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పదవి ఉద్ధవ్‌ను వరించింది. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి నాయకుడు ఉద్ధవ్ కావడం విశేషం. 2021లో 13 పెద్ద రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్టు పాపులర్ సీఎం’గా ఉద్ధవ్‌కు అత్యుత్తమ ర్యాంకు దక్కడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మంది మళ్లీ ఉద్ధవ్‌కే ఓటు వేస్తామని చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రేకు చిన్నప్పటి ఫొటోగ్రఫీపై అమితాసక్తి. ఆయన తీసిన ఎన్నో ఫొటోలను ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రకృతి అందాలను, కోటలను ఆయన కెమెరాల్లో చక్కగా బంధించారు. ఉద్ధవ్ 1989లో రష్మీ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఆదిత్య, తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివసేన యువజన విభాగం అధ్యక్షుడైన పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర కేబినెట్‌లో పర్యాటకం, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు తేజస్ ఠాక్రే పర్యావరణ పరిరక్షకుడిగా, వైల్డ్‌లైఫ్ పరిశోధకుడిగా కొనసాగుతున్నారు.
వివాదాలు.. ఆరోపణలు
► మహారాష్ట్ర ప్రభుత్వంపై ఠాక్రే కుటుంబ పెత్తనంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిపాలనలో ఉద్ధవ్ భార్య, కుమారుడి జోక్యం మీతిమీరుతోందంటూ సాక్షాత్తూ శివసేన ఎమ్మెల్యేలే రచ్చకెక్కారు.
► మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న అభియోగాలు ఉద్ధవ్‌పై ఉన్నాయి.
► పార్టీలో సంక్షోభం ముదురుతున్నా గుర్తించకపోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం ఉద్ధవ్ పదవికి ఎసరు తీసుకొచ్చింది.
► అనైతిక పొత్తులను శివసేన నేతలు, ప్రజా ప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలతో తలపడి, ఫలితాల తర్వాత అవే పార్టీలతో జతకట్టడం చాలామందికి నచ్చలేదు.
► బలమైన నాయకుడైన ఏక్‌నాథ్ షిండేను పక్కనపెట్టి, సంజయ్ రౌత్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఎమ్మెల్యేలు సహించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment