అమిత్ షా తనయుడు జయ్ షా.. ఇన్‌సెట్లో అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ అమిత్ షాపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోనే జయ్ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్ అమాంతం పెరిగిపోయిందని, అంతేకాకుండా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆయన కంపెనీలకు భారీ రుణాలు అందాయని 'దవైర్.ఇన్’ వెబ్‌సైట్ ఓ కథనంలో పేర్కొంది. బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమ అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆ వెబ్‌సైట్ ఈ కథనాన్ని ప్రచురించిందని మండిపడింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశంపై దర్యాప్తు జరిపి.. నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశాయి. తన తండ్రి పరువు-ప్రతిష్టలను దెబ్బతీసేలా కథనం ప్రచురించిన వెబ్‌సైట్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని జయ్ షా ఒక ప్రకటనలో తెలిపారు.
జయ్ షాకు చెందిన టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో కొనసాగుతోందని, కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కంపెనీకి రూ. 15 కోట్ల రుణం అందిందని, దీంతో 2015లో ఆ కంపెనీ టర్నోవర్ రూ. 80 కోట్లకు పెరిగిందని వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత నష్టాలతో ఆ కంపెనీని మూసినట్టు తెలుస్తోందని తెలిపింది. జయ్ షాకు చెందిన మరో కంపెనీ.. గుజరాత్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రూ. 25 కోట్ల రుణం తీసుకున్నదని, అంతేకాకుండా అదే కంపెనీని పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థగా మార్చి.. కేంద్ర విద్యుత్ శాఖ నుంచి రూ. 10.35 కోట్లు రుణం తీసుకున్నదని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే, జయ్ షాకు మద్దతుగా నిలిచిన అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. నిబంధనల ప్రకారమే ఆయనకు విద్యుత్‌శాఖ రుణం ఇచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment