ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్నారు. ఇంతకంటే ఘనమైన ప్యాకేజీని ఎవరిస్తారు అంటూ.. ప్రధాని నరేంద్ర మోదీని అసెంబ్లీ సాక్షిగా కీర్తించారు. అరుణ్‌జైట్లీని ఘనంగా సత్కరించారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అన్నారు. హోదా కలిగిన రాష్ట్రాలు ఏమి సాధించాయి? రికార్డులను తిరగేయండి అంటూ..మాట్లాడారు. నాలుగేళ్లు బీజేపీ ప్రభుత్వంతో అధికారం పంచుకొని..అకస్మాత్తుగా మాట మార్చారు. ప్రత్యేక హోదా విషయంలోరాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి.. తీరని అన్యాయం చేశారు. అనుభవం ఉందని చెప్పి.. అధికారంలోకి వచ్చి.. మితిమీరిన దుబారా,అవినీతి,అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు. ప్రజల వ్యక్తిగత గోప్యతను పాటించాల్సిన డేటా.. ప్రైవేటు వ్యక్తుల వద్దకుచేరడమే పాలకుల అక్రమ వ్యవహారాలకు నిదర్శనం. పోలవరం విహారయాత్రల పేరిట రూ.400కోట్లు ఖర్చు చేయడం చంద్రబాబు సర్కారు దుబారాకు పరాకాష్ట. ఈ పరిస్థితుల్లో వాస్తవాలనుతెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది’.. అంటున్నారుఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, యూపీఎస్సీ మాజీ సభ్యులువై.వెంకట్రామిరెడ్డి. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేకఇంటర్వ్యూలో రాష్ట్రంలో ఐదేళ్ల పాలనాతీరును ఏకి పారేశారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సీఎస్‌లే అవినీతిపై గళమెత్తడం అనూహ్యం
ప్రభుత్వంలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సీఎం తర్వాత రాష్ట్ర పాలనలో కీలక పాత్ర పోషించేది సీఎస్‌లే. అలాంటి చీఫ్ సెక్రటరీలు చంద్రబాబు పాలనలో అవినీతి, అరాచకాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన.. æ మాజీ ప్రభుత్వ కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లం ప్రభుత్వలో అవినీతిపై మాట్లాడటం చూస్తుంటే.. రాష్ట్ర పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఏ స్థాయిలో ప్రబలిందో అర్థం చేసుకోవచ్చు. రైతులకు మొండి చేయి... శంకుస్థాపనల పేరిట అంతులేని దుబారా... సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడం... గృహనిర్మాణ పథకంలో కోట్ల అవినీతి... ముడుపులు ఇవ్వనిదే ఏ పని జరగడంలేదని స్వయంగా మాజీ ప్రధాన కార్యదర్శులే చెబుతుండటం అనూహ్యం. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ వినలేదు.
ప్రజాధనం దుర్వినియోగం
పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైందో మనందరికీ తెలుసు. అనుమతులు తెచ్చిందొకరు. జాతీయ ప్రాజెక్ట్‌గా చేసిందొకరు. కేంద్ర ప్రభుత్వ డబ్బు ఖర్చుపెట్టింది మరొకరు. మరి పోలవరం అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటో ఎవరికి అర్థం కాలేదు. కానీ మేమే చేశాం. మేమే చేçస్తున్నామని డబ్బాకొడుతున్నారు. పోలవరం నిర్మాణం బాధ్యతలు చంద్రబాబు తీసుకోవడం తప్పు. ఎందుకుంటే.. పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వం పరిధిలో నిది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో వేగంగా, సమర్థవంతంగా, నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించే సామర్థ్యం గల సంస్థలు చాలా ఉన్నాయి. సెంట్రల్ పవర్ అండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సంస్థ దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ. ఇలాంటి సంస్థలకు ఇచ్చి ఉంటే.. కేవలం మూడేళ్లలోనే పోలవరం పూర్తయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకోవడం అత్యుత్సాహమే. పోలవరం పూర్తిచేయకపోవడమే కాకుండా.. అంచనా వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పోలవరం పూర్తయి ఉంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది. విహార యాత్రల పేరిట రూ.400కోట్లు దుర్వినియోగం చేసి.. పూర్తికాని పోలవరం ప్రాజెక్టు దగ్గరకు ప్రజలను తీసుకురావడమేమిటి? ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా? ఇలాంటి నిర్ణయాలు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు.
సింగపూర్ మాట..ఆత్మన్యూనతకు నిదర్శనం
సింగపూర్ తరహాలో రాజధాని నిర్మిస్తామని పదేపదే చెప్పడం ఆత్మన్యూనతాభావం. భారతీయ ఇంజనీర్ల పర్యవేక్షణలో రాజధాని నిర్మిస్తే.. మురికివాడలుగా మారుస్తారని చంద్రబాబు పేర్కొడం హాస్యాస్పదం. అమితమైన నైపుణ్యం గల భారత ఇంజనీర్లు ఎంతోమంది ఉన్నారు. మన వాళ్లు ఎందులోనూ తీసిపోరనే స్పృహను ప్రభుత్వం కల్పించాల్సిందిపోయి.. వారిని కించపరచేలా మాట్లాడం సరికాదు. ఇపుడు సీఆర్‌డీఏ పరిధిలో పనిచేస్తున్న నిర్మాణ కంపెనీకి మహీధర్‌రెడ్డి అనే ఇంజినీర్ ప్రధాన పర్యవేక్షకుడు. ఇక్కడే జేఎన్‌టీయూ అనంతపురంలో బీటెక్ చేశారు. మన వాళ్లు ఎందులోనూ తీసిపోరనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు రాజధాని విషయంలో మొదట్నుంచీ అడుగడుగునా అవినీతి రాజ్యమేలింది. రాజధానిగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో చంద్రబాబు తన బినామీలు, తన సామాజిక వర్గం వాళ్లతో తక్కువ ధరకు భూములు కొనిపించడం.. ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల భూములు లాక్కోవడం దారుణం. రాజధాని పేరిట బాగుపడుతున్నది తనవాళ్లే తప్ప, ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదన్నది వాస్తవం.
బేషరతుగా రుణ మాఫీ చేయాలి: గత సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామని పదేపదే హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెట్టారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ.. షరతులు విధించారు. అరకొర రుణమాఫీ చేస్తూ.. అది కూడా ఐదు విడతల్లో చేస్తామని చెప్పారు. ఆఖరుకు తేలిందేమిటంటే.. ప్రభుత్వం ఇచ్చింది వడ్డీకి కూడా సరిపోలేదు. అయితే రుణమాఫీ చేయకుండా.. చంద్రబాబు ప్రభుత్వం రుణ మాఫీ చేసేశామని విపరీతంగా ప్రచారం చేసుకోవడం రైతులను అవమానించడమే అవుతుంది. బేషరతుగా రుణమాఫీ చేయకుండా.. వారిని అన్యాయానికి గురిచేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా విస్మరించారు. దీంతో వీటిపై వడ్డీకి వడ్డీ పెరిగిపోయింది. వడ్డీలు కట్టలేక డ్వాక్రా మహిళలు డీఫాల్టర్లు అయ్యారు. రెతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం రైతుల ఖాతాల్లో వెయ్యి రూపాయలు విదిలిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు కూడా చెక్కులు ఇస్తూ మభ్యపెడుతున్నారు. వాస్తవానికి రైతులకు ,డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేయాలి. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రకటించిన హామీలను.. ఎన్నికల ముందు అమలు చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయం చేయడం తగదు
జాతి రక్షణకు దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా సైన్యం సెర్జికల్స్ స్ట్రైక్స్ చేసింది. ప్రధాని మోదీ నిర్ణయంపై భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై మోదీ కఠినవైఖరి అవలంబిస్తారు. ఇలాంటి విషయాలను సైతం రాజకీయం చేయడం సిగ్గుచేటు. మన సర్జికల్ స్ట్రైక్స్‌ను అమెరికా, జర్మనీ, జపాన్ దేశాలు సైతం హర్షించాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్థాన్ ప్రధానిని కీర్తించడం అవివేకం.
రావాల్సిన నిధులు అందుకే రాలేదు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాకుండా.. రూ.2.50 లక్షల కోట్లు వివిధ ఫండింగ్ ఏజెన్సీల నుండి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది. తాము ఇచ్చిన నిధులకు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు ఇవ్వమని మోదీ ప్రభుత్వం అడిగింది. అడిగిన లెక్కలు చూపలేక కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. యూసీలు సరైన సమయంలో ఇవ్వకపోవడంతో రావాల్సిన నిధులు సైతం అందలేదు. ఫలితంగా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాయలసీమతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50కోట్లు రావాల్సి ఉంది. అవి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లాకు ఈ ఐదు సంవత్సరాల్లో రూ.250 కోట్లు రావాలి. కానీ అందలేదు. నిధులు తీసుకొచ్చే చొరవ ప్రదర్శించలేదు.
♦ ‘‘భారతీయ ఇంజనీర్ల పర్యవేక్షణలో రాజధాని నిర్మిస్తే.. మురికివాడలుగా మారుస్తారని చంద్రబాబు పేర్కొడం హాస్యాస్పదం. అమితమైన నైపుణ్యం గల భారత ఇంజనీర్లు ఎంతోమంది ఉన్నారు. వారిని కించపరచేలా మాట్లాడం సరికాదు.’’
♦ ‘‘రుణమాఫీ చేయకుండా.. చంద్రబాబు ప్రభుత్వం రుణ మాఫీ చేసేశామని విపరీతంగా ప్రచారం చేసుకోవడం రైతులను అవమానించడమే అవుతుంది. బేషరతుగా రుణమాఫీ చేయకుండా.. వారిని అన్యాయానికి గురిచేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా విస్మరించారు’’
♦ ‘‘వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఐటీ గ్రిడ్స్, బ్లూప్రాగ్ కంపెనీకు ప్రజల వ్యక్తిగత సమాచారం ధారాదత్తం చేయడం వంటివి సైబర్ నేరాలే’’
కియో ఘనత బాబుది కాదు
గమ్మత్తయిన అంశం ఏమిటంటే.. సీఎం ప్రత్యేక విమానంలో ఎక్కడికైనా వెళతారు? ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా దక్షిణ కొరియాకు వెళ్లారా? కియో కంపెనీ ప్రతినిధులు కంపెనీ ఏర్పాటు కాక ముందు సీఎంను ఎప్పుడైనా కలిశారా? అనే అంశాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు స్పష్టమవుతాయి. కియోమోటార్స్ వంటి బహుళజాతి కంపెనీ ఏర్పాటు కావడానికి కారణాలు అనేకం ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ సంబంధాలు బలోపేతం చేయడంతోపాటు మేకిన్ ఇండియా ప్రధానమైన అంశం. ఇందులో భాగంగానే కియో కంపెనీ ఏర్పాటైంది. బెంగుళూర్ దగ్గరకావడం, చెన్నై సముద్ర తీరం చేరువలో ఉండటం, అనంతపురం జిల్లాలో భూమి అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా కియో కంపెనీ వచ్చింది. హంద్రీనీవా నుండి నీరు సరఫరా చేసే అంశంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.
ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట
రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కుల వ్యవస్థను పెంచి పోషించారు. అసమర్థులైనా సరే ఒకే సామాజిక వర్గం వారిని ఉన్నత పదవుల్లో గత 5 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని నిర్ణయం మేరకు ఈ తంతు జరుగుతోంది.
అప్రజాస్వామిక విధానాలు
ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్య విధానాలు యథేచ్చగా అమలవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మేల్యేలను నిసిగ్గుగా అధికార పార్టీలోకి తీసుకోనే ఫిరాయింపు రాజకీయాలు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జరగడం దురదృష్టకరం. హర్యానాలో ఒక నానుడి ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మేల్యేలు.. అధికార పార్టీలోకి ఫిరాయింపులు జరపేలా ప్రోత్సహించే విధానాన్ని ‘ఆయారాం.. గయారాం ’ అని హర్యానాలో పిలుస్తారు. ఇక్కడా అదే తరహా అప్రజాస్వామ్య విధానాలు అమలు అవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మేల్యేలకు ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం దౌర్భాగ్య విధానాలకు పరాకాష్ట. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ పదికాలాలు పాటు పదిలంగా ఉండేలా చర్యలు తీసుకునే వ్యవస్థ రావాలి.
డేటా ధారాదత్తం... సైబర్ నేరమే
వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన∙బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఐటీ గ్రిడ్స్, బ్లూప్రాగ్ కంపెనీకు ప్రజల వ్యక్తిగత సమాచారం ధారాదత్తం చేయడం వంటివి సైబర్ నేరాలే. వాస్తవానికి గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఇలా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలున్నాయి. హిల్లరీ క్లింటన్‌ను ఓడించాలనే ఎత్తుగడలు జరిగినట్లు ప్రచారం జరిగింది. కొందరు ప్రవాసులు ఇక్కడి ప్రభుత్వంలో ఉండే కీలకమైన వ్యక్తులతో కలిపి.. ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాగునీరు సైతం అందని పరిస్థితి
హంద్రీనీవా పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. మా సొంతూరు అనంతపురం జిల్లా గార్లదిన్నె. పెన్నా నదీ పరివాహ ప్రాంతంలో ఉంది. తాగునీటికి ఏ నాడు కొరత లేదు. కానీ ఇప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు. తాగునీరు సైతం అందని పరిస్థితి. హంద్రీనీవాను పూర్తీ చేయకుండా.. చేతులారా రాయలసీమను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. ఆయ కట్టుకు నీరివ్వకుండా.. నేరుగా ప్రధాన కాలువకే నీరు తరలించే జీవోలు.. అన్నదాత శ్రేయస్సుకు విఘాతం కలిగించేవే. ప్రధాన కాలువలకు సైతం నీరు వదలలేని పరిస్థితి తలెత్తింది.– శ్రీనివాసరెడ్డి, ఎస్కేయూ, అన ంతపురం
Comments
Please login to add a commentAdd a comment