
యనమల రామకృష్ణుడు (ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ఆరెస్సెస్ భావజాలంతో పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బీజేపీ పట్ల గవర్నర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కేవలం ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని యనమల అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టపగలే హత్యచేశారు. ప్రజాస్వామ్యవాదులు వజుభాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గవర్నర్ తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారం అంటే పక్షపాతంతో వ్యవహరించడం కాదని హితవు పలికారు.
యనమల తన ప్రకటనలో పేర్కొన్న అంశాలివే.. ‘కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదు. కానీ గవర్నర్ బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రానికో రకంగా వ్యవహరించరాదు. దేశం మొత్తం ఒకే విధానం అనుసరించాలి. అలాగైతే గోవా, మేఘాలయ, మణిపూర్‌లలో గవర్నర్‌లు వేరే విధంగా వ్యవహరించారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ను మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. 10 నెలల క్రితం బిహార్‌లో అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీని, గోవాలో కాంగ్రెస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించలేదు. గవర్నర్ వజుభాయ్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. భారత రాజ్యాంగానికి ద్రోహం చేశారు, నేతల కొనుగోళ్లకు అవకాశం కల్పించారు. యడ్యూరప్ప శనివారం మెజార్టీ నిరూపించుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. గవర్నర్ చేసిన తప్పును కొంతమేర సుప్రీంకోర్టు చక్కదిద్దిందని అభిప్రాయపడ్డారు.