
యడ్యూరప్ప
బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటు వేయకుండా ఇళ్లలో కూర్చునే వారి కాళ్లు చేతులు కట్టేసి మరి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయించాలని ఆ పార్టీ సీఏం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెలగావి ప్రచారసభలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఇప్పుడు విశ్రాంతి తీసుకోకండి. ఓటువేయకుండా దూరంగా ఉండాలని ఎవరైన ఉన్నారని మీకనిపిస్తే.. వారి ఇంటికి వెళ్లండి. కాళ్లు, చేతులు కట్టేసి మరి బీజేపీ అభ్యర్థి మహంతేష్ దొడ్డగౌడార్(కిత్తూర్ అభ్యర్థి) కు ఓటు వేయించండి’ ’ అని కార్యకర్తలకు సూచించారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. యడ్యూరప్ప రాజ్యంగాన్ని అవమాన పరిచారని, బీజేపీకి ఓటమి భయం పట్టుకోవడంతోనే ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ఇక అంతకు ముందే బీజేపీ ప్రకటించిన అభ్యర్థులను, యడ్యూరప్ప అవినీతిని, ప్రధాని మోదీని ఉద్ధేశిస్తూ 80 సెకన్ల వీడియోను రాహుల్ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు టికెట్టు ఇవ్వడాన్ని తప్పుపడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 11 మంది అభ్యర్ధుల గురించి ఏం సమాధానం చెప్తారంటూ మోదీని నిలదీసారు.