
కర్ణాటక గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప
బెంగళూర్ : కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం రాజీనామా చేశారు. కర్ణాటకలో పాలక జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినందున అవసరమైన చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప కోరారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం సాయంత్రం యడ్యూరప్ప గవర్నర్‌తో సమావేశమయ్యారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ కుమారస్వామి సర్కార్‌కు తగినంత సంఖ్యా బలం లేనందున తక్షణమే సీఎం కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కుమారస్వామికి లేదని అన్నారు. మరోవైపు ముంబై హోటల్‌లో అసమ్మతి ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నించిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ముంబైలో మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డగించడం చూస్తుంటే బీజేపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన తీరు వెల్లడవుతోందని ఆరోపించారు.