
టెక్కలిలో అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, టెక్కలి: సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. తుపాన్ వస్తుందని తెలిసినా తమను గాలికి వదిలేసి వెళ్లిపోయారని, చంద్రబాబు కంటే నీచమైన వ్యక్తి ప్రపంచంలోనే ఉండడని ప్రజలంతా మండిపడుతున్నారని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు మనస్తత్వం గురించి ఓ పెద్దాయన చెప్పిన విషయాలను వెల్లడించారు.
‘బస్సు ప్రమాదం జరిగి అందులో పది మంది చనిపోతే మనమంతా అయ్యే అనుకుంటాం. కానీ చంద్రబాబు అలా కాదు. ఆ బస్సులో 40 మంది బతకడం తన విజయం అని తను చెప్పుకోగలుగుతాడు. చంద్రబాబు ఒక స్థాయి దాటి పోయాడన్నా. దేవుడి మీద, సృష్టి మీద విజయం సాధించానని.. నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందన్నా. పెథాయ్ తుపాను వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ప్రజలను గాలికి వదిలేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్లియాడు. పెద్ద తుపాను రాబోతోందని తెలిసి కూడా ప్రత్యేక విమానంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణాస్వీకారానికి వెళ్లాడు. ఆయన అక్కడకు వెళ్లాల్సిన అవసరముందన్నా?’ అని తనను పెద్దాయన ప్రశ్నించాడని వైఎస్ జగన్ తెలిపారు.
సముద్రాన్ని కంట్రోల్ చేశానని, పెథాయ్ తుపాన్‌ను ఓడించానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఎల్లోమీడియా ఆకాశానికెత్తడాన్ని ప్రతిపక్ష నేత ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టి కొత్త సినిమాకు చంద్రబాబు తెర తీశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా లాక్కుకోవడం, వాడుకోవడమేనని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాక్కునాడని గుర్తు చేశారు. తనుకు తానుగా సాధించింది ఒక్కటంటే ఒక్కటీ లేదని తూర్పారబట్టారు. భారత వాతావరణ శాఖ, ఇస్రో కంటే తాము ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ కచ్చితమైన సమాచారం అందించిందని చంద్రబాబు డబ్బా కొట్టువడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు.
టెక్కలిలో జన సునామీ
జననేత వైఎస్ జగన్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో టెక్కలిలోని అంబేద్కర్ జంక్షన్‌లో జన సంద్రాన్ని తలపించింది. దారులు, వీధులన్నీ జనంతో కిక్కిరిశాయి. కనుచూపు మేరంతా జనమే కనిపించారు. రాజన్న తనయుడి మాటలను వినేందుకు ప్రజలు అత్యంత ఆసక్తి చూపించారు. ఇళ్లపైకి ఎక్కి జననేత ప్రసంగాన్ని విన్నారు. వైఎస్ జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment