
సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్‌ఆర్ సువర్ణయుగం తీసుకు వస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకుంటేనే జీవితాలు మారుతాయని, పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తానని, వైఎస్‌ఆర్‌ను గుర్తు తెచ్చేలా చదువుల విప్లవం తీసుకు వస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంటే కాకుండా స్కాలర్ షిప్‌లు కూడా రావడం లేదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక... ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంత ఉన్నా తమ ప్రభుత్వం చదివిస్తుందన్నారు. అంతేకాకుండా మెస్ బోర్డింగ్ ఫీజులు కూడా చెల్లిస్తామని తెలిపారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఆదివారం కోడుమూరు నియోజకవర్గం గోరంట్లలో బీసీ సంఘం ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. కురువలను బీసీల నుంచి ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాల్మీకులు, బోయలను కూడా ఎస్టీలో చేరుస్తామని, రజకులను ఎస్సీలుగా గుర్తిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇప్పటివరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయడం ధర్మమేనా?. ఎన్నికల ముందు కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు.
చంద్రబాబు సీఎం కాకముందు రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులు ఉండేవి. ఇప్పుడు రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు కట్టించారా?. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబులేదు, నిరుద్యోగ భృతి లేదు. బీసీల మీద నిజమైన ప్రేమ ఉన్న నాయకుడు వైఎస్‌ఆర్. వైఎస్‌ఆర్ హయాంలో బీసీల పిల్లలు ఉన్నత చదవులు చదువుకున్నారు. ఎన్నికలొస్తే బీసీలంటే చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపిస్తారు. ఎన్నికల ముందు ఓ మాట, అయ్యాక మరో మాట మాట్లాడటం ఆయనకు అలవాటే. చంద్రబాబు లాంటి వారి వల్ల రాజకీయ వ్యవస్థ విశ్వసనీయత కోల్పోయింది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. పాదయాత్రలో నా దృష్టికొచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తా. రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకువస్తా. అందులోని ప్రతి అక్షరాన్ని తుచ తప్పకుండా అమలు చేస్తా.’ అని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment