రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్ధి విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆఖరు నిమిషం వరకూ రాజమండ్రి రూరల్ స్థానానికి పోటీ పడిన దుర్గేష్‌ను పవన్ కళ్యాణ్- చంద్రబాబు నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన అయిష్టంగా అక్కడకు వెళ్లేందుకు ఒప్పుకున్నారు. తనకు రూట్ క్లియర్ అయిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల భావిస్తున్నా, ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఎంతమేర సహకరిస్తారోనని టీడీపీ నేతలను ఓటమి భయం పట్టి పీడిస్తుంది.
తీవ్రంగా పోటీపడి, సామదాన భేధ దండోపాయాలు ఉపయోగించి మరీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య దక్కించుకున్నారు. అధికారికంగా పేరు వెల్లడించకపోయినా, దాదాపుగా రాజమండ్రి రూరల్ స్థానం ఆయనకు ఖరారైనట్టే. అయితే జనసేన అభ్యర్ధి దుర్గేష్‌తో పోటీ పడి మరీ ఈ స్థానాన్ని దక్కించుకున్న గోరంట్లకు ఇంకా స్థిమితంగా లేరట. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన కాపు సామాజికవర్గం హవా అత్యధికంగా ఉన్న రాజమండ్రి రూరల్ స్థానం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాపుసామాజికవర్గానికి చెందిన దుర్గేష్ స్వతంత్ర్య అభ్యర్ధిగా, ఆకుల వీర్రాజు వైఎస్ ఆర్ అభ్యర్ధిగా పోటీ పడ్డారు. దీంతో చాలావరకూ కాపు ఓట్లు చీలిపోయాయి. దుర్గేష్ 46 వేల ఓట్లు సాధించుకోగలిగారు. ఆకుల వీర్రాజు రెండో స్థానంలో నిలిచారు. విజయం బుచ్చయ్యకు దక్కింది.
ఈసారి టీడీపీ-జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు భరోసా ఇచ్చారు కనుక రూరల్ స్థానం తనదేనని దుర్గేష్ భావించారు. అయితే అనూహ్యంగా ఆయనను నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో అయిష్టంగా ఊ కొట్టారు. అయితే జనసేన క్యాడర్ మాత్రం దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీ కి దింపాలని పలు ఆందోళనలు నిర్వహించింది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ వీటిని లక్ష్యపెట్టలేదు. దీంతో పదోసారి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు బుచ్చయ్య చౌదరి సిద్దపడుతున్నారు. అయితే ఈసారి తమ నాయకుడు బరిలో ఉంటారని భావించిన జనసేన క్యాడర్ బుచ్చయ్యకు ఎంతమేర సహకరిస్తారన్న విషయంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.
ఇప్పటికే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య ఈసారి తమ అభ్యర్ధికి అవకాశం ఇస్తారని జనసేన కార్యకర్తలు భావించారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన దుర్గేష్ కు అవకాశం కల్పిస్తే గెలిపించుకోవాలని భావించారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో బుచ్చయ్యకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పొత్తు లేకపోయినా, జనసేన-టీడీపీ నాయకులు కలిసే పనిచేశారు.అయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు పదేళ్లపాటు రూరల్ లో శాసనసభ్యుడిగా కొనసాగిన బుచ్చయ్యచౌదిరి పై టీడీపీ క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో తమకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానికులకు కూడా బుచ్చయ్య అభ్యర్ధిత్వంపై గుర్రుగా ఉన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా ఓడించాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
మరోవైపు, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా వచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోను పర్యటిస్తున్నారు. మంత్రి వేణు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తరువాత నాయకులు, కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం కలుగుతోంది. ఎక్కడిక్కడ అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో విజయం సాధించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నా: ముద్రగడ
Comments
Please login to add a commentAdd a comment