
రాజమండ్రిలో టీడీపీ-జనసేనల మధ్య రాజకీయం మరింత వేడెక్కిందనడం కంటే రచ్చకెక్కిందనడమే ఇక్కడ సరిపోతుంది. ప్రధానంగా సైకిల్ పార్టీ, గ్లాసు పార్టీలు ఇక్కడ సీటుపై ఒకరిపై ఒకరు కారాలు-మిర్యాలు నూరుకుంటూ సీటు మాదే అంటే మాది అంటూ.ప్రకటనలు చేసేస్తున్నారు. ఇందుకు కారణం రాజమండ్రి రూరల్ సీటు జనసేనదేనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేయడమే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్.. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించగా.. తాజాగా రాజమండ్రి రూరల్ కూడా జనసేనకేనని తేల్చేశారు.
దానిలో భాగంగానే కందుల దుర్గేష్ జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుబోతున్నానంటూ ప్రకటించి తెలుగుదేశం శ్రేణులకు షాకిచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానంతో చర్చించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని కూడా పవన్ తెలిపినట్లు దుర్గేష్ తెలిపారు.
రాజమండ్రి రూరల్ టికెట్ నాదే
పవన్ ఇచ్చిన హామీతో రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనంటూ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి టికెట్ తనదేనంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసారని, ఇక్కడ నుంచి జనసేన తరఫున తాను బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా కందుల దర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేను సీనియర్‌ని.. ఈ టికెట్ నాదే
తాను జిల్లాలో సీనియర్ నాయకుడినని, జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుడినని, టికెట్ తనదే అంటున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ‘ఇందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ టికెట్ నాకే. జనసేనకు మరో నియోజకవర్గం కేటాయిస్తాం. సర్దుబాటు వాళ్లిష్టం’ అంటూ గోరంట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న గోరంట్ల తన సీటుకే ఎసరు పడుతుందా అనే డైలమాలో పడ్డారు.
టీడీపీ నేతల్లో అసంతృప్తి
రాజానగరం టికెట్ జనసేన ప్రకటించడంతో ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతలు.. రాజమండ్రి రూరల్‌లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మాత్రం.. పవన్ కళ్యాణ్ టికెట్లు ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి రూరల్ ,రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గం సీట్లు కోల్పోయేనట్లేనని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్ టికెట్లను ఇచ్చుకుపోతూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇది చంద్రబాబు ఇచ్చిన హామీతోనే పవన్ ఇలా చేస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ-జనసేనల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోంది.