
హరిపురం వద్ద భారీ జనసందోహం మధ్య పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సాగుతున్న మోసపూరిత పాలనకు బలై కునారిల్లుతున్న రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని.. వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 నెలల కిందట ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం చిట్టచివరి అంకానికి చేరుకుంది. మధ్యాహ్నం జగన్ పలాస నియోజకవర్గ సరిహద్దు దాటి తాళభద్ర జంక్షన్ వద్ద ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా ప్రజలకు చేరువవుతూ కాలినడకన రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తానని జగన్ ప్రకటించిన విషయం విదితమే. దారి పొడవునా ప్రజల వెతలను తెలుసుకుంటూ, వివిధ వర్గాల నుంచి జయ జయధ్వానాలు అందుకుంటూ ముందుకు సాగిన జగన్.. రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, వారి కష్టాలను ఆకళింపు చేసుకున్నారు.ఆయన ఇచ్ఛాపురం పరిధిలోకి ప్రవేశించేటప్పుడు స్థానిక ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించింది. పార్టీ పతాకంలోని రంగులతో కూడిన తోరణాలు, ఫ్లెక్సీలతో స్వాగతాలు పలకడంతో ఉత్సవ వాతావరణం కనిపించింది. ఇచ్ఛాపురం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మరో మాజీ ఎమ్మెల్యే లల్లూ, నియోజకవర్గం నేత నర్తు రామారావు.. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఎదురేగి జగన్‌కు స్వాగతం పలికారు.
జాతరను తలపించిన పల్లెలు
వైఎస్ జగన్ పాదయాత్రగా తమ ఊర్లకు వచ్చినప్పుడు ఆ పల్లెల్లో జాతర వాతావరణం కనిపించింది. రాత్రి బస చేసిన శిబిరం నుంచి నడక ప్రారంభించి హరిపురం, అంబుగాం, రాణిగాం, మామిడిపల్లి, పాత్రపురం క్రాస్, తురకశాసనం క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పల్లెల్లో జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సంబరంగా ఎదురేగిన జనం.. తమ గ్రామాల్లోకి సాదరంగా ఆహ్వానించారు. వారందరినీ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఇదే సమయంలో వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు. మన ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పరిష్కరిస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
కిడ్నీ మహమ్మారి కబళిస్తోందయ్యా..
వైఎస్ జగన్ ఎదుట లోహరిబంద కిడ్నీ బాధితుల ఆవేదన
వజ్రపుకొత్తూరు: మా పంచాయతీ పరిధిలో కిడ్నీ మహమ్మారి ప్రజలను కబళిస్తోందయ్యా.. చిన్నా పెద్దా తేడా లేదు. ఇటీవల ఒకే రోజు ముగ్గురు చనిపోయారు. పంచాయతీలో దాదాపు 5,500 మంది జనాభా ఉండగా 1,500 మంది కిడ్నీ రోగులున్నారంటూ శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరిబంద పంచాయతీ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అందాల శేషగిరి వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం అంబుగాం వద్ద పాదయాత్రగా వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసి వారి కష్టాలు చెప్పుకున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 70 మంది వరకు కిడ్నీరోగులు చనిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. బోర్ల నుంచి తోడిన నీటిని గ్రామంలో పంపిణీ చేస్తున్నారని, ఉద్దానం మంచినీటి పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ పంపిణీ చేస్తున్నా.. అది బురదమయమై పశువులు సైతం తాగలేని పరిస్థితి ఉందన్నారు. పలాస సీహెచ్‌సీలో డయాలసిస్ కేంద్రం ఉన్నా.. పడకలు అందుబాటులో లేవని, నెఫ్రాలజీ వైద్యుడు సైతం రావడం లేదని వాపోయారు. హరిపురం సీహెచ్‌సీలో ఎక్స్‌రే తీయమంటే బయట తీసుకోవాలని చెబుతున్నారని, వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్నారు. పీహెచ్‌సీల్లో కిడ్నీ రోగులకు మందులు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుజల పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. భూగర్భం నుంచి తోడిన ఆ నీటిని సరిగా ఫిల్టర్ చేయడం లేదన్నారు. కిడ్నీ రోగులకు మందుల కోసం నెలకు రూ.8 వేలు ఖర్చవుతోందని, విశాఖపట్నం వెళ్లి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే.. కనీసం బస్‌పాస్‌లు కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా కిడ్నీ రోగుల కోసం పరిశోధనాస్పత్రి ఏర్పాటు చేస్తానని, నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తామన్న వైఎస్ హామీపై వారు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం సహాయనిధి అందకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు..
నాకు నాలుగేళ్ల కిందట కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. బంధువులంతా విరాళాలు సేకరించి రూ.30 లక్షలతో ఆపరేషన్ చేయించారు. తర్వాత చూపు మందగించడంతో మళ్లీ బంధువుల సాయంతో కళ్లకు శస్త్ర చికిత్స చేయించారు. ఇప్పుడు కూడా చూపు అంతంత మాత్రమే. నెలకు మందుల కోసం రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని సీఎం సాహాయ నిధిని రానీయకుండా ఈ టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.
– నల్లా రమేష్, గౌడుగురంట గ్రామం, మందస మండలం
పెద్దల అండదండలున్న వారికే తుపాను పరిహారం
అర్హత ఉన్నా ఈ టీడీపీ నాయకులు సంక్షేమ పథకాలు అందనీయడం లేదు. తిత్లీ తుపాను కారణంగా నాకున్న 120 కొబ్బరి చెట్లు, జీడితోట ధ్వంసమయ్యాయి. నిలువ నీడ లేదు. చాలా మందిది ఇదే పరిస్థితి. బాధితుల వివరాలు సేకరించిన అధికారులు.. పరిహారం అందించడంలో ముఖం చాటేస్తున్నారు. పెద్దల అండదండలున్నవారికే ఇస్తున్నారు.
– సింగుపురం కృష్ణమ్మ, నిమ్మాన ఏకాశమ్మ, .జెనగ దమయంతి, హరిపురం, పలాస
బెంతు ఒరియాలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
సార్.. బెంతు ఒరియాలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర గజిట్ ప్రకారం మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించాల్సి ఉంది. గతంలో మాకు ఎస్టీ ధ్రువప్రతాలిచ్చి.. ఆ తర్వాత ఆపేశారు. వైఎస్ హయాంలో మా జీవన విధానంపై అధ్యయనం చేసేలా థర్డ్ పార్టీ కమిటీ కూడా వేశారు. మా ప్రాంతంలో అధ్యయనం చేసిన ఈ కమిటీ.. మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించాలని నివేదిక రూపొందించింది. ఇంతలో వైఎస్ మరణంతో ఆ నివేదిక బుట్టదాఖలైంది. మీరే మాకు న్యాయం చేయాలి..
– రజనీకుమార్ దొలై, శ్యాం పురియా, దేవరాజ్ సాహు,వ బల్లిపుట్టుగ, కవిటి మండలం, పలాస