ఎన్ని లక్షలైనా ఆరోగ్యశ్రీలో ఉచితం | YS Jagan promises to the public about Arogya sri scheme | Sakshi
Sakshi News home page

వైద్యం ఖర్చు ఎన్ని లక్షలైనా ఆరోగ్యశ్రీలో ఉచితం

Published Wed, Jan 10 2018 1:14 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

YS Jagan promises to the public about Arogya sri scheme - Sakshi

చిత్తూరు జిల్లా పెనుమూరులో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘గుండె, మెదడు, కిడ్నీలు, నరాల ఆపరేషన్లు చేయించుకోవాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు పోతాం. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయని. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేయడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులపాలవుతున్నారు. ఈయన నాలుగేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పేదవాడికి అందకుండా పోయింద’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలను ఈ దుస్థితి నుంచి కాపాడి.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వర్ణ యుగాన్ని మళ్లీ తీసుకు వస్తామని చెప్పారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 57వ రోజు మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒకడుగు ముందుకు వేసి ఎంతో చేశారు. ఆయన కుమారునిగా తాను రెండడుగులు ముందుకు వేస్తానని చెప్పారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయం 
‘‘పెద్ద పెద్ద జబ్బులకు మంచి వైద్యం అందించే అసుపత్రులన్నీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌ మనకు 60 సంవత్సరాల పాటు రాజధాని నగరంగా ఉండింది. అందువల్ల ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లి చూపించుకుంటాం. ఇవాళ అలా చూపించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తింప చేయరట. పోనీ ఇక్కడేమైనా మంచి ఆసుపత్రులు ఉన్నాయా అంటే లేని పరిస్థితి. మూగ, చెవుడుతో బాధపడే చిట్టిపిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఆపరేషన్‌ చేయించకపోతే జీవితాంతం మూగ, చెవిటి వారుగానే బతకాల్సి ఉంటుంది. అటువంటి పిల్లలకు నాన్నగారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు.

కిడ్నీ రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్‌ చేయించాల్సి ఉంటుంది. ఒక్కసారి డయాలసిస్‌ చేయించడానికి రూ.2 వేలు ఖర్చవుతుంది. అంటే నెలకు ఆ పేదవాడికి రూ. 20 వేలు.. సంవత్సరానికి రూ.2 లక్షలు ఖర్చవుతుంది. క్యాన్సర్‌ వచ్చిందీ అంటే కీమో థెరపీ చేయాలి. కనీసం ఏడెనిమిది సార్లు కీమో థెరఫీ చేస్తే కాని పూర్తిగా నయంకాని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఒకటి, రెండుసార్లు కీమో థెరపీ చేయించి వదిలేస్తోంది. ఇలా చేస్తే మళ్లీ క్యాన్సర్‌ తిరగబెడుతుంది. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 8 నెలల నుంచి  ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. రేపు దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య శ్రీ కింద ఎక్కడైనా చికిత్స పొందే వీలు కల్పిస్తాం. పేదవాడికి ఆపరేషన్‌ జరిగాక తిరిగి కోలుకునే వరకు ఆర్థికంగానూ ఆదుకుంటాం. దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న వారికి రూ.10 వేల పింఛన్‌ ఇస్తాం.
 
ఈ వ్యవస్థలో మార్పు రావాలి 
 చంద్రబాబును ఇకపై కూడా నమ్మితే రేపు మీ దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా? చిన్నచిన్న మోసాలతో మిమ్మల్ని లొంగదీసుకోలేనని పెద్ద పెద్ద మోసాలకు దిగుతాడు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికీ బెంజికారు కొనిస్తానంటాడు. నేను మిమ్మల్నందరినీ ఒకటే అడుగుతావున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌ వల్ల మాత్రమే సాధ్యం కాదు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాల పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడటమే నా లక్ష్యం. నాన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటూండేవారు.

పేదవాడు అప్పులపాల య్యే పరిస్థితి ఎప్పుడు వస్తుందీ అంటే పిల్లలను బాగా చదివించాలని ఆరాట పడినప్పుడు.. జబ్బుల బారిన పడి ఆస్పత్రి పాలయినప్పుడు అని. ఆ పరిస్థితి రాకూడదనే ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ తీసుకువచ్చారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆయ న స్ఫూర్తితో ఈ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తాం. పేద విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్, ఇతర పెద్ద చదువులు ఏం చదివినా .. అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తాం. హాస్టల్‌ చార్జీల కింద ఏటా రూ.20 వేలు ఇస్తాం. చిట్టి పిల్లలు బడికి వెళ్తేనే పేదల బతుకులు బాగుపడతా యి. వారిని బడులకు పంపిస్తే ఏటా తల్లికి రూ.15 వేలు ఇస్తాం. నేను ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలకు సంబంధించి ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే పాదయాత్రలో నన్ను నేరుగా కలిసి అర్జీ రూపంలో ఇవ్వచ్చు’’ అని జగన్‌ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement