వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ | YS Jaganmohan Reddy promise to the people about Aarogyasri | Sakshi
Sakshi News home page

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ

Published Sun, Dec 24 2017 1:06 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM

YS Jaganmohan Reddy promise to the people about Aarogyasri - Sakshi

శనివారం అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ఏ వ్యాధినైనా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి పేదలందరినీ ఆదుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా చూస్తానన్నారు. డాక్టర్ల సూచన మేరకు వ్యాధిగ్రస్తులు తీసుకునే విశ్రాంతి సమయంలోనూ డబ్బు ఇస్తానన్నారు. మూత్రపిండాల జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకే చంద్రన్న మాల్స్‌ను పెట్టారని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 42వ రోజు శనివారం సాయంత్రం అనంతపురం జిల్లా కదిరి సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఉపాధి పేరిట దారుణ వంచనకు పాల్పడ్డారని, ఫలితంగా ప్రతి ఇంటికీ ఇప్పటికే చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డారన్నారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అధర్మం.. అవినీతి.. మోసం.. అబద్ధాలు
చంద్రబాబు పాలన అంతా అధర్మం, అవినీతి, మోసం, అబద్ధాలే. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నికల ముందు వందలాది హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు చంద్రబాబు నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చారా లేదా అన్నది మనమంతా ప్రశ్నించుకోవాలి.ఈ మనిషి నైజం ఒక్కసారి గమనించండి. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టాడు. ఇంటికొకరికి ఉద్యోగం రాకపోతే, ఉపాధి కల్పించకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. రాష్ట్రంలో కోటీ 75 లక్షల ఇళ్లుంటే ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంపించి ఈ విషయం చెప్పాడు. మరి ఇప్పుడు ఇచ్చారా? (లేదు, లేదు అని ప్రజల నుంచి జవాబు) ఇలా ప్రతి ఇంటికి చంద్రబాబు గత 45 నెలల కాలానికి రూ.90 వేలు బాకీ పడ్డారా లేదా? (అవును, అవును అని ప్రజల నుంచి సమాధానం) ఉద్యోగాలు ఇప్పించకపోగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు.  ఓటుకు కోట్లు కేసులో ప్రజాప్రతినిధుల కొనుగోలుకు సంబంధించి వీడియో, ఆడియో టేపులతో అడ్డంగా దొరికి పోయి ఆ విచారణ జరక్కుండా ఉండేందుకు ప్రత్యేక హోదాను అమ్మేశాడు. ఆయన చెప్పిన వన్నీ అబద్ధాలే. 

కదిరికి మంచినీళ్లు మహానేత ఘనతే..
కదిరిలో మంచినీళ్ల బిందె రూ.5, రూ.10 పెట్టి కొనుక్కుంటున్న దశలో నాన్నగారు రూ. వంద కోట్లు కేటాయించి చిత్రావతి నుంచి కదిరికి నీళ్లు తెచ్చారు. అనంతపురం జిల్లా ప్రజలు బాగుండాలని, హంద్రీ– నీవా ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన తీసుకువచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 80 శాతం పని పూర్తి చేశారు. చెర్లోపల్లి రిజర్వాయర్‌ వైఎస్‌ ఘనతా కాదా? వైఎస్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ హంద్రీ–నీవా ప్రాజెక్టులో మిగిలిపోయిన 20 శాతం పనులు పూర్తి చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పిల్ల కాల్వలు తవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాలేదు. ఈ పని చేసి ఉంటే దాదాపు 1.24 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఉండేవి. చంద్రబాబు సీఎం హోదాలో వచ్చి కదిరి చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తానన్నాడు. ఎక్కడైనా కనిపించిందా? తనకల్లులో డిగ్రీ కాలేజీ, జిల్లాలో సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, హార్టికల్చర్‌ హబ్, స్మార్ట్‌ సిటీ, టెక్స్‌టైల్‌ పార్క్, ఫుడ్‌ పార్క్, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ క్లస్టర్‌ అంటూ హామీలు గుప్పించారు. నాలుగేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటీ చేపట్టలేదు. కదిరిలో ప్రె‹స్‌ క్లబ్‌ కడతానన్నారు. చివరకు ఇంత చిన్న పని కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అందుకే ఇటువంటి పాలన పోవాలి. 

జన్మభూమి కమిటీల మాఫియా..
పైస్థాయిలో చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే కింది స్థాయిలో గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీల పేరిట మాఫియాను తయారు చేశారు. పింఛన్లు కావాలన్నా, రేషన్‌ కార్డులు కావాలన్నా, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో మీకు ఇలాంటి నాయకుడు కావాలా? ఇలాంటి వ్యక్తిని క్షమిస్తే.. రేపు ఇంకా పెద్ద మోసాలు చేస్తారు. ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు తీసుకుని ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నీతి, నిజాయితీ, విశ్వసనీయత వస్తుంది. అది ఒక్క జగన్‌ వల్ల కాదు. మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.’’అని వైఎస్‌ జగన్‌ కోరారు.

అధ్వానంగా ఆరోగ్యశ్రీ పథకం
రేపు దేవుడు ఆశీర్వదించి, మీ ఆశీస్సులతో మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నామో తెలియజేసేందుకే నవరత్నాల పథకాలను ప్రకటించాం. వాటిల్లో ఒక్క దాన్ని మీకు వివరిస్తా. ఇవాళæ పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించాలంటే మనమంతా హైదరాబాద్‌కో, మరేదైనా పెద్ద ఆస్పత్రికో వెళ్తాం. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చంద్రబాబు చెబుతున్నాడు. ఆయన పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు. దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స కోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వెళ్తే ఆపరేషన్లు చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లేవారు. ఈ వాళ ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అక్కడ డాక్టర్లు పేషెంట్లను ముట్టుకోవడం లేదు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్‌ చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చవుతుంది. వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని ప్రస్తుత పాలకులు చెబుతున్నారు.

అంటే ఆ చిన్నపిల్లలు జీవితాంతం మూగ, చెవుడుతోనే బాధ పడాలా? క్యాన్సర్‌ వస్తే ఆ వ్యాధిని నయం చేసుకోవాలంటే 7 లేదా 8 సార్లు కీమో థెరపీ చేయించుకోవాలి. చంద్రబాబు మాత్రం రెండు సార్లు మాత్రమే కీమో థెరపీకి డబ్బులు ఇస్తానంటున్నాడు. రెండుసార్లు కీమోథెరపీ తర్వాత క్యాన్సర్‌ తగ్గినట్టు కనిపించినా తిరిగి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా నయం అయ్యే వరకు కీమోథెరపీ అవసరం. దీన్నిబట్టి చూస్తే చికిత్స కోసం వెళ్లిన వారు అక్కడి నుంచి పైకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కిడ్నీ పేషెంట్ల పరిస్థితి దారుణంగా ఉంది. వారానికి రెండు లేదా మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. ఒక్కోసారి డయాలసిస్‌కు రూ.2 వేలు ఖర్చవుతుంది. నెలకు ఎంతలేదన్నా రూ.20 వేలు, ఏడాదికి రూ.2 లక్షల ఖర్చు అవుతుంది. ఎవరైనా ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్‌ అని అడిగితే ఏడాది తర్వాత రండని చెబుతున్నారు. ఇలా అయితే పేదవాడు ఏవిధంగా బతకగలడు? ఇవాళ 108, 104 సర్వీసులు ఎక్కడా కనిపించడం లేదు.

ఆ వేళ నాన్న గారు ఒక అడుగు ముందుకువేసి ఆరోగ్య శ్రీని ప్రవేశపెడితే ఆయన కుమారునిగా నేను రెండడుగులు ముందుకు వేస్తున్నా. ప్రతి పేదకూ ఉచితంగా ఎంతటి పెద్ద ఆపరేషన్‌ అయినా చేయిస్తానని మాట ఇస్తున్నా. రూ.1000 ఖర్చు దాటే ప్రతి వైద్యాన్నీ ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా ఎక్కడైనా సరే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. డెంగీ, మలేరియా లాంటి వ్యాధులన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి చికిత్స చేయిస్తాం. డాక్టర్‌ సలహా మేరకు రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో వారి కుటుంబం గడిచేందుకు డబ్బు ఇస్తాం. తలసేమియా, మూత్ర పిండాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న రోగులకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం. 108, 104కు ఫోన్‌ కొడితే చాలు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం. చివరకు 102కు ఫోన్‌ కొడితే మేకలు, ఆవులు, పశువులకు కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇస్తున్నా. వీటిలో ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు నేరుగా నన్ను కలవచ్చు.

విచ్చల విడిగా ఎమ్మెల్యేల కొనుగోలు...
పట్టపగలే రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడు. వారిపై అనర్హత వేటు వేయడు. రాజ్యాంగాన్ని దగ్గరుండి తూట్లు పొడుస్తున్నాడు. చట్టాలను తయారు చేసే చట్ట సభల్లోనే చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి అంత నల్లధనం ఎక్కడి నుంచి వస్తుందని అడిగే నాథుడే లేడు. ఈ వేళ ఏ పార్టీ వాళ్లు మంత్రివర్గంలో ఉన్నారో అందరికీ తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement