
తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్..
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నిశ్చయ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమరావతి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం తన పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలను నివేదించారు. కేంద్రం నుంచి చాలా సహాయం అవసరమవుతుందని ప్రధానిని అభ్యర్థించారు. అన్ని రకాలుగా సాయపడాలని కోరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడుతూ ప్రధానితో చర్చించిన విషయాలను వెల్లడించారు. సోమవారం ప్రత్యేక విమానంలో గన్నవరంకు వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.