పెట్రోలియం వనరులు పుష్కలం అయినా.. : వైఎస్‌ జగన్‌ | Ys Jagan Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 7:02 PM | Last Updated on Thu, Jul 26 2018 7:17 PM

Ys Jagan Slams Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, ముమ్మిడివరం : ఈ ప్రాంతంలో పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నా ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడం లేదని, చమురు, గ్యాస్‌ తీసుకుంటున్నారు.. కానీ ఇక్కడి ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి టీడీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు పాదయాత్రలో భాగంగా ముమ్మిడివరం హైస్కూల్‌ సెంటర్‌ వద్దనిర్వహించిన బహిరంగ సభలో ఆయన స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

చుట్టూ గోదావరి కానీ.. తాగడానికి చుక్క నీరులేదు..
‘జీవనది గోదావరి ప్రవహించే నేల కోనసీమ.. అయినా తాగునీరు ఉండదు. పెట్రోలియం వనరులు పుష్కలం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలుండవు. అందరూ గల్ఫ్‌ వెళ్లాల్సిందే. కోనసీమ ముఖ చిత్రం ఇలా ఉంటే .. బాబుగారి దోపిడీ మాత్రం గేదల లంకే వరకు విస్తరించింది.  అదే గ్రామంలో ఈ దోపిడి అడ్డుకున్న మహిళలు, యువకులపై అనేక కేసులు పెట్టారని బాధితులు నాతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా.. ఈ జిల్లా నుంచి 19స్థానాలకు 14 స్థానాలు టీడిపీకి ఇచ్చాం. ఇవి సరిపోవని వైసీపీ ఎమ్మెల్యేలను పశువల సంతాలా కొన్నాడన్నా.. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలున్నారన్నా కానీ చేసిందేమి లేదన్నా అని ఇక్కడి ప్రజలు నాతో ఆవేదన చెందుతున్నారు. ఈ మీటింగ్‌లో నీళ్లు చూపించడన్నా.. అని బాటిల్‌ చూపిస్తూ.. ఇది చెరుకు రసం కాదయ్యా బాబు ఇవి వారు తాగే మంచీ నీరు అని చెప్పమన్నారు. ఇది కోనసీమ పరిస్థితి. వ్యవసాయం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది.

ఇక్కడి రైతులకు మేలు జరగాలని దివంగత నేత, నాన్నగారు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి డెల్టా అభివృద్దికి కాలువల నిర్మాణాలతో కృషి చేశారు. కానీ ప్రస్తుతం పోలవరం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. డెల్టా కాలువ పనులు ఆగిపోయాయి. ఏ పని కూడా ఒక్క అడగు కూడ ముందుకు వెళ్లని పరిస్థితుల్లో ఈ జిల్లా ఉంది. రైతులంతా గతంలో క్రాప్‌ హాలిడే డిక్లేర్‌ చేశారు. ఆరోజుల్లో లేవనెత్తిన సమస్యలు.. నాతో చెప్పినవి.. నవంబర్‌ వచ్చే సరికి ఈ ప్రాంతంలో వరుసగా తుఫానులు వస్తాయన్నా. వాటి తుఫానులతో చేతికొచ్చిన పంట నీటిమయమమ్యే అవకాశం ఉందని, జూన్‌ తొలి మాసంలోనే నీళ్లందించాలని, క్రాప్‌ హాలిడేను డిక్లేర్‌ చేశారు. ఆరోజు నేను వచ్చా.. చంద్రబాబు సైతం పిట్టల దొరలా వచ్చాడు. జూన్‌ తొలి వారంలోనే నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా నీళ్లు అందయా అని అడుగుతున్నా..(ప్రజల నుంచి లేదు.. లేదు.. అని సమాధానం) జూన్‌ మాసం దేవుడేరుగు.. మళ్లీ నవంబర్‌ వస్తుంది... నారుమళ్లు వేస్తున్న  రైతన్నా మళ్లీ భయపడుతున్నాడు.


చుట్టూ కొబ్బరి పంట.. ఆ పంట రైతులు నుంచి వస్తున్న మాట..
ఇదే రైతన్నా నా దగ్గరికి వచ్చి చెప్పింది.. వరికి మధ్దతు ధర రూ. 1500 అంటారన్నా.. కానీ మార్కెట్‌ తీసుకెళ్తే రూ.1130 కూడా అడుగుతలేరన్నాఅని ఆవేదన వ్యక్తం చేశాడు. చుట్టూ కొబ్బరి పంట.. ఆ పంట రైతులు నుంచి వస్తున్న మాట .. బాబు ముఖ్యమంత్రి అయిండు మా కర్మ ధర అమాంతం పడిపోయిందన్నా అని నాతో బాధపడ్డారు. దీనికి కారణం దళారీలకు నాయకుడు, గంజదొంగలకు నాయకుడు ఈ పెద్దమనిషే. హెరిటేజ్‌ ఫ్రెష్‌ అని షాప్‌ పెట్టాడు.. రైతుల నుంచి కొనుగోలు చేసి వాటినే ప్యాక్‌ చేసి అధిక ధరలకు అమ్ముకుంటాడు. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాల్సిన ముఖ్యమంత్రే ఓదళారీలా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నికల సమయంలో కొబ్బరి పరిశ్రమ పెడతానని ఊదర గొట్టాడు. ఇప్పుడేక్కడైన అది కనిపిస్తుందా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి పరిశ్రమలు నెలకొల్పాలనే సోయి కూడా మన సీఎంగారికి లేదు.  
నీటి పంటకు సైతం..
అన్నా ఈ నియోజకవర్గంలో 16 వేల ఎకరాల్లో రొయ్యలు, చేపలు పెంచుతాం. నేల మీద పండే పంటలకే కాదన్నా నీటిలో పండే పంటలకు కూడా మద్దతు ధరల్లేవన్నా అని  డ్వాక్రా రైతులు నాతో ఆవేదన వ్యక్తం చేశారు. దళారులంతా కుమ్మక్కై ధర పడిపోయేలా చేస్తున్నారన్నా అని బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రంగాన్ని, వాళ్ల ఆవేదన చూసి, దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం వస్తే యూనిట్‌ రూ.1.50 కరెంట్‌ ఇస్తానని పాదయాత్రలో చెప్పా. వెంటనే జిత్తులమారి ఈ పెద్దమనిషి రెండు రూపాయలకు ఇస్తానని చెప్పాడు. గత ఒక నెల నుంచి బాబు పాంప్లెట్‌ పేపర్లు రోజుకో స్కీమ్‌.. అంటూ ఎన్నికలు ముందు రోజుకో సినిమా చూపిస్తున్నాయి.

తాగు నీటికి ఇ‍బ్బంది పడుతున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో  గ్రౌండ్‌ వాటర్‌ అంతా ఉప్పు నీరు అయిన పరిస్థితి. గోదావరి నీళ్లంతా ఈ ప్రాంతాలకు వచ్చే సరికి కలుషితమవుతున్నాయి. రక్షిత మంచినీళ్లు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నీళ్లు చూపించడమే కాకుండా ఇంకో విషయం అడుగమన్నారు. గత ఎన్నికల ముందు రెండు రూపాయలకే 20 లీటర్ల నీళ్లిస్తానన్న హామీ ఎమైందనీ నిలదీయమన్నారు. ఈ నియోజక వర్గంలో నాన్నగారు చేసిన పనిని గుర్తుచేసుకుంటున్నారు. 18 కోట్లతో పోలమ్మ చెరువులో మంచి నీటి ప్రాజెక్టుచేపట్టాడని, కానీ ప్రస్తుతం దాన్ని పట్టించుకునే నాదుడే లేడని చెబుతున్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో మంచినీళ్లు లేవు. చెబితే పట్టించుకునే నాదుడు లేడు. కాట్రేని కోట మండలం, మూలపులంలో నాన్నగారు  2009లో బ్రిడ్జి మంజూరు చేశాడని, అప్పుడు 30 శాతం పనులు కూడా అయ్యాయని, కానీ ప్రస్తుతం దాన్ని పట్టించుకునే నాదుడు లేడన్నా అని అక్కడి ప్రజలంతా నాతో బాధపడుతు తెలిపారు.
 

కొత్త ఉద్యోగాలేమో.. ఉన్న ఉద్యోగాలు..
గుత్తేనదీవి నుంచి గోదావరి పాయవరకు 10 కోట్లతో గ్రామాలకు అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు చేస్తే ఆ తరువాత పట్టించుకోక పోవడంతో లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. గుజరాత్‌ పెట్రోలియం శాఖ చేపట్టిన  పైపు లైను తవ్వకాల ద్వారా  మత్స్యకారులు నష్టపోతారని, అప్పడు ఆ కుటుంబాలకు 17 నెలల పాటు 6,500 రూపాయలు ఇచ్చేలా తీర్మానం చేశారనీ, కానీ, 6 నెలలే ఇచ్చారని ఆ కుటుంబాలంతా నాతో ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ పెట్రోలియం శాఖ వారు స్థానికంగా 2000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఆ కంపెనీ కాస్త ఓఎన్జీసీలో విలీనం కావడంతో ఆ ఉద్యోగాలు సైతం తీసేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడన్నా అని వాపోతున్నారు. చంద్రబాబు విశాఖలో మీటింగ్‌లో పెట్టి ఏపీకి 20లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయంటాడు.. కొత్త ఉద్యోగాలు వచ్చాయంటాడు.. కొత్త ఉద్యోగాలేమో కానీ, మా ఉన్న ఉద్యోగాలు పోతున్నయన్నా అని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ ప్రాంతంలో 20 వేల ఇళ్లు కట్టించారన్నా. బాబు ఒక్కటంటే ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదన్నా అని ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారు. 

ఇప్పడు గాడిదలు కాస్తున్నారా.?
ఎన్నికలకు ముందు హోదా సంజీవిని అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ అడిగారు. అప్పుడు విభజన చట్టంలోని హామీలు ఏమిగుర్తుకు రాలేదు. కానీ ఈ మధ్యలో ధర్మపోరాటం అని, కాకినాడలో ఆశ్చర్యం కలిగించే మాటలు చెప్పాడు. ఇంతకు బాబుగారు విభజన చట్టం చూశారా? అని మీ ద్వారా నేను అడుగుతున్నా.. ప్రత్యేక హోదాను పార్లెమెంట్‌ సాక్షిగా ఇస్తామని చెప్పారు. ఆరు నెల్లలో ఇచ్చిన హామీలన్నీ కార్యచరణలోకి తీసుకొస్తామన్నారు. ఆ హామీల్లో కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్‌, దుగ్గరాజు పట్నం తొలి దశ పూర్తి అని హామీలున్నాయి. బీజేపీతో కలిసున్నన్ని రోజులు మాట్లాడని చంద్రబాబు కొత్తగా 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారట.  25 మందిలో 20 మంది ఎంపీలు బాబుదగ్గరే ఉన్నారు.. ఇంత మంది ఎంపీలతో నాలుగేళ్లుగా ఆయన గాడిదలు కాస్తున్నారా.?’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

‘మరో ఆరునెలల్లో ఎన్నికలొస్తాయని అంటున్నారు ఈ పరిస్థితిల్లో ఒక్కసారి ఆలోచించండి. అబద్దాలు చెప్పేవారు మీకు నాయకుడుగా కావాలా? మోసాలు చేసే వాడు కావాలా అని అడుగుతున్నా? (ప్రజలనుంచి వద్దవద్దు..అనే సమాధానం), అధికారంలోకి రాగానే నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషం నింపుతాం. ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలకు పునర్వైభవం తీసుకోస్తాం. ప్రజల కోసం ఆ దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఒకడుగు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు ముందుకేస్తా’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement