దిగ్విజయీభవ | YS Jagan YSRCP Party Campaign in Narsipatnam | Sakshi
Sakshi News home page

దిగ్విజయీభవ

Published Mon, Mar 18 2019 12:24 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YS Jagan YSRCP Party Campaign in Narsipatnam - Sakshi

అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి కె.సత్యవతిని పరిచయం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,ప్రక్కన నర్సీపట్నం అసెంభ్లీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

సుమారు ఏడు నెలల క్రితం..నర్సీపట్నం.. హోరువాన..ఇప్పుడు.. ఆదివారం.. అదే నర్సీపట్నం.. మలమలమాడ్చేసే మండుటెండ..కానీ నాడూ.. నేడూ.. కనిపించిన దృశ్యం ఒక్కటే.. జనం.. జనం.. జనం..
అభిమాన నేతను చూడాలన్న ఆరాటం.. ఆయన చెప్పేది వినాలన్న ఉత్సుకత.. అవే.. నాడు భారీ వర్షాన్నీ.. నేడు మండుటెండనూ లెక్కచేయకుండా రోడ్డుపైకి రప్పించింది.అంతటి అపూర్వ ఆదరణ చురగొన్న ఆ నేత.. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్‌సీపీ అధినేతగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల్లో ఉంటూ.. పోరాటాలు చేసిన ఆయన రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే కీలకమైన ఎన్నికల యుద్ధంలో ప్రచార శంఖం పూరించడానికి వచ్చినప్పుడు.. అశేష జనవాహిని సాక్షిగా.. నర్సీపట్నం అత్యంత ఆదరణతో అక్కున చేర్చుకుంది. దిగ్విజయీభవ.. అని నిండు మనసుతో ఆశీర్వదించింది. నిప్పులు చెరిగే ఎండలో అభిమాన జల్లులు కురిపించింది.

జనం ఉత్సాహం.. కేరింతలతో ఉప్పొంగిపోయిన జననేత.. నర్సీపట్నం సాక్షిగా.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. అని నినదించారు. రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 3648 కి.మీ. పాదయాత్ర సందర్భంగా ‘మీ కష్టాలు చూశాను. మీ సమస్యలు విన్నాను.. ఇక అన్నీ నాకొదిలేయండి.. నాదీ భరోసా.. ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడుస్తాను.. కష్టాలు తీరుస్తాను’.. అని హామీ ఇచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఒటేయాలని అడిగే ముందు ఇదే నా పిలుపు.. విజ్ఞప్తి అని వినమ్రంగా చెప్పారు.

ఎండ వేళ నడిరోడ్డుపై ఎండమావులు కనిపిస్తుంటాయి.. నీళ్లున్నట్లు భ్రమింపజేస్తాయి.. కానీ అక్కడ ఏమీ ఉండదు.. చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలు కూడా ఆ ఎండమావుల్లాంటివేనని.. గత ఐదేళ్లలో ఆయన ఇచ్చిన వాగ్దానాల అమలు తీరు చూస్తే.. ఇదే అర్థమవుతుందని.. అందువల్ల వాటిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు తాత్కాలిక ప్రయోజనం కోసం.. ఓట్లు కొల్లగొట్టేందుకు ఇచ్చే డబ్బు మూటలకు మోసపోవద్దని సూచించారు.జిల్లాలో ఇటు నర్సీపట్నంలో నడిరోడ్డుపై వైఎస్‌జగన్‌ ప్రచార సభ జనప్రభంజనంతో హోరెత్తితే.. అటు విశాఖ నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు అట్టహాసంగా షామియానాలు, కుర్చీల వేసి మరీ నిర్వహించిన సభ జనాలు లేక బోసిపోయింది. పైగా సుదీర్ఘంగా.. సుత్తిలా సాగిన ఆయన ప్రసంగం వినలేక ప్రజలు మధ్యలోనే పలాయనం చిత్తగించారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, నర్సీపట్నం: నర్సీపట్నం ప్రజలు విజయీభవ అంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదిస్తూ తమ మద్దతు ప్రకటించారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు, ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా  మీ వెంటే మేముంటామంటూ బాసటగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నర్సీపట్నంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సభకు జనం పోటెత్తారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ వేదికపైకి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి   మాట్లాడుతూ గతంలో పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు వర్షం వచ్చినా, ఇప్పుడు మండుటెండ కాస్తున్నా లెక్చచేయకుండా వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సమయంలో తాను విన్న ప్రజల కష్టాలు, కళ్లారా చూసిన నష్టాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకపోవడంతో అనారోగ్యంతో ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలను చూశానని చెప్పారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల బాధలు, పిల్లల చదువుల కోసం ఆస్తులమ్ముకున్న కుటుంబాలను చూశానంటూ చెప్పుకొచ్చారు.

పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, సాగుకు రుణాలివ్వక ఇబ్బందులు పడుతున్న రైతన్నల బాధలను కళ్లారా చూశానన్నారు. రేషన్‌కార్డు నుంచి పింఛను మంజూరు వరకు ప్రభుత్వం జన్మభూమి కమిటీల  పేరుతో దోచుకునే తతంగాన్ని చెవులారా విన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రజల బాధలే కాకుండా అధికారి వనజాక్షిని వేధింపులకు గురిచేయడం, తన సొంత  చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని సైతం గొడ్డళ్లతో నరికి పొట్టన పెట్టుకుని అ«ధికార దాహంతో చట్టాలను సైతం పట్టించుకోకుండా అధికార పార్టీ బకాసురులు చేసిన ఘన కార్యాలయాలను ప్రజలకు వివరించారు. ఇంతటి ఘనకార్యాలు చేసిన జిత్తులమారి చంద్రబాబు ఎన్నికల్లో ప్రతి ఓటుకు మూడు వేల రూపాయలిచ్చి కొనుగోలు చేసి మళ్లీ సీఎం కుర్చీ ఎక్కేందుకు పన్నాగం పన్నుతున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాటికి లొంగిపోకుండా నిర్భయంగా వైఎస్సార్‌ పార్టీకి ఓటేసి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే  మీ అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. అవినీతి లేని పాలన కోసం, కుల పిచ్చిలేని పరిపాలన అందించేందుకు వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని జగన్‌ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే చదువుల భారం తల్లిదండ్రులపై లేకుండా ఎన్ని లక్షలు ఖర్చైనా అందరి పిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు.

జన్మభూమి కమిటీలను రద్దు చేయడమే కాకుండా లంచాలనేవి లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ హామీ ఇచ్చారు. మహిళల రక్షణ, చదువులు, ఉద్యోగాలు, ఆరోగ్యం వంటి అన్ని రకాలైన వసతులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసి కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతామన్నారు. ప్రత్యేకహోదా సాధనతో పరిశ్రమలను తీసుకొచ్చి, వాటిలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా 45 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ. 75 వేలు అందిస్తానన్నారు.

ఈ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రుణాలన్నీ రద్దు చేసి, వడ్డీలేని రుణాలను అందిస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు  భరోసా ఇచ్చారు. రైతులకు మే నెల నాటికే పెట్టుబడి కింద రూ.12, 500 అందిస్తానని హామీ ఇచ్చారు. తాను నవరత్నాలను ప్రకటించడంతో అవ్వా, తాతలకు చంద్రబాబు ఎన్నికలు దగ్గర చేసి  పింఛను రూ. రెండు వేలు చేశాడు. అదే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే రూ.మూడు వేల వరకు పెంచుతానని హామీ ఇచ్చాడు. ప్రతి నాయకుడు, కార్యకర్త మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలని, పార్టీ ప్రకటించిన నవ రత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నర్సీపట్నం అసెంబ్లీ, అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పెట్ల ఉమాశంకర్‌ గణేష్, కె.సత్యవతిలకు ఆశీస్సులు అందించి గెలిపించాలని పిలుపునిచ్చారు. సభలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అరకు ఎంపీ అభ్యర్థి గొట్టేటి మాధవి, అనకాపల్లి, యలమంచిలి అసెంబ్లీ అభ్యర్థులు గుడివాడ అమర్‌నా«థ్, కన్నబాబురాజు, భీమిలి, చోడవరం అభ్యర్థులు అవంతి శ్రీనివాస్, ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement