
సాయం సామాన్యం.. స్ఫూర్తి మహనీయం : భూమన కరుణాకర్‌రెడ్డి
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి చేసే ప్రతి పనిలోనూ, ఆలోచనలోనూ ఆవిష్కృతమయ్యే వినూత్నత అందరినీ అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఆయన కార్యకలాపాలకూ. ఆయన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరించే జ్ఞాపకాల జాబితాకి అంతుండదు. గంభీరంగా కనిపించే ఆయన హృదయం ఎంత హృద్యమైనదో తెలిసిపోతుంటుంది. దాని వైశాల్యం వెల్లడవుతుంటుంది. మా జీవన పయనంలో నేను చూసిన చాలా సంఘటనలలో ఇవి కొన్ని మాత్రమే...
ఒకరోజు మంగంపేట మైన్స్ దగ్గరికి వైఎస్ వచ్చారు. అప్పుడే అక్కడ కొందరు పనివాళ్లు అప్పుడే భోజనం ముగించి లేచారు. నేల మీద చిందరవందరగా మెతుకులు. ‘‘బతికించే మెతుకులివి. పరబ్రహ్మస్వరూపం అరచేతుల్లో ఉండాలి. కాళ్ల కిందికి రాకూడదు’’ అంటూ ప్రతి మెతుకునూ వెతికిపట్టి పక్కన పడేశారు. నిజానికి ఆయన అలా చేయమని ఆ కూలీలకు ఆదేశమివ్వవచ్చు. కానీ అప్పుడే భోజనం ముగించిన ఆ తృప్తితో ఒక సంతృప్త స్థితిలో ఉన్నారు వారు. వాళ్లను బెదరనివ్వకూడదూ... ఆ స్థితిని చెదరనివ్వకూడదనుకున్నారు. అందుకే ఆ చిన్న పనికి తాను స్వయంగా పూనుకున్నారు.
అప్పట్లో వైఎస్ గారు కోడూరు నుంచి చెన్నైకీ.... చైన్నై నుంచి కోడూరుకి తిరుగుతుండేవారు. ఈ రెండు ఊళ్ల మధ్య తిరువళ్లూరు అనే ఒక ఊరు ఉంది. దాని శివార్లలో ఒక చిన్న టీ–స్టాల్ ఉండేది. ఆయన ప్రతిసారీ ఆ టీ అంగడి దగ్గర ఆగి కాస్త టీ తాగి మళ్లీ ప్రయాణం కొనసాగించేవారు. మొదట్లో వైఎస్ ఎవరో ఆ టీ స్టాల్ నడిపే వ్యక్తికి తెలియదు. తెలుసుకున్న తర్వాత అతడి ఆనందానికి అవధుల్లేవు. అంతటివారు అక్కడ ఆగి టీ తాగడమే ఎంతో సంతోషంగా భావించేవాడా టీ స్టాల్ వ్యక్తి. కష్టాల్లో ఉన్నప్పుడు కొంత ఆర్థికసహాయమూ అందించారాయన.
1998లో ఒకసారి నేనూ, వైఎస్ జో«ద్‌పూర్‌కు వెళ్తున్నాం. ట్రైన్‌లో ఒక 14, 15 ఏళ్ల అబ్బాయి బిచ్చమెత్తుకుంటూ ఉన్నాడు. పక్కనే అతడి చెల్లెలూ ఉంది. ముక్కుపచ్చలారని పిల్లలు అలా అడుక్కోవడం వైఎస్‌ను చలించిపోయేలా చేసింది. వెంటనే వాళ్ల స్థితిగతులు, తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నారు. వాళ్ల దీన స్థితిని తెలుసుకొని కదలిపోయారు. అంతే... అప్పటికప్పుడు రూ. 10,000 తీసి వాళ్లకు ఇచ్చారు.
అంత పెద్దమొత్తం వాళ్ల చేతుల్లో చూస్తే వాళ్లను ఎవరైనా అనుమానించవచ్చు లేదా వాళ్ల దగ్గర కొట్టేయవచ్చు. అందుకే తన దగ్గర ఉన్న కర్చిఫ్‌లో ఆ మొత్తాన్ని జాగ్రత్తగా కట్టి ఇచ్చారు. ఇస్తూ... ‘ఇకపై అడుక్కోకండి. ఇవి పదివేలు. మీ నాన్న చేస్తున్న పనిని నువ్వు చేసుకో. లేదా నువ్వే ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టి దాన్ని చేసుకో. ఇకపై యాచించకు’’ అని చెప్పారు. పదివేలా అన్నట్టు చూస్తే... ‘‘వాడేదైనా ఉపాధి మార్గం చూసుకుంటే అదే పదివేలు’’ అన్నారాయన ఎప్పటిలాగే నవ్వుతూ.
1986లో ఒకసారి మేమిద్దరం ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నాం. ఆ సమయంలో ఒక భిక్షువును ఒక వ్యక్తి తన జీపుతో గుద్దేశాడు. వెంకటగిరి శివార్ల వద్ద జరిగిందా సంఘటన. తక్షణం ఆగమేఘాల మీద ఆ భిక్షువును ఆసుపత్రికి తరలించారు. అతడి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చులన్నీ వైఎస్ భరించారు. అంతేకాదు... ఆ తర్వాత అతడికి భవిష్యత్తులో ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు నా ద్వారానే అతడికి రూ. 50,000 పంపించారు. ఆ పైకం ఆ రోజుల్లో పెద్ద మొత్తమే. ఒక వ్యక్తి తన మిగతా జీవితమంతా సాఫీగా గడిచిపోయేలా చూసుకునేందుకు వీలైనంత పెద్దమొత్తమది.
యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప నేత : ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
ఎస్... ఈ రాష్ట్రానికి ఎంతోమంది లీడర్లను తీర్చిదిద్ది అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. 1983లో సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్‌టీఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి జవసత్వాలు నింపే బాధ్యత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పగించింది అధిష్టానం. అలా పీసీసీ నాయకుడిగా నియమితుడై ఆ బాధ్యతలను ఒక సవాలుగా తీసుకున్నారు వైఎస్సార్.
అప్పటికే పాత తరం నాయకులతో నిండిన కాంగ్రెస్ పార్టీలో యువతకు చోటివ్వాలని ఆయన తలపోశారు. 1985 సంవత్సరంలో నరసన్నపేట నుంచి పోటీ చేసే అవకాశం నాకు కల్పించింది ఆయనే. అప్పటికి నా వయస్సు 27 సంవత్సరాలే. నన్ను నేను నిరూపించుకొనే అవకాశం ఇచ్చారు. నాలా చాలామంది యువతను ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
భావితరాలకు దిక్సూచిగా...
చేవెళ్ల నుంచి ప్రారంభమైన వైఎస్సార్ పాదయాత్ర విజయనగరం జిల్లా నుంచి రాజాం మీదుగా శ్రీకాకుళంలో అడుగుపెట్టింది. అప్పుడు నేనొక్కడినే జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని. పాదయాత్ర ఏర్పాట్లన్నీ నాకు అప్పగించారు. ఈ కార్యక్రమం ఇచ్ఛాపురంలో ముగిసింది. దానికి గుర్తుగా అక్కడ స్తూపం ఏర్పాటు చేయించాను. వైఎస్సార్ ఆశయం ఏమిటో, ఆయన పాదయాత్ర చేపట్టడం వెనుక ఉద్దేశం ఏమిటో భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఈ స్తూపం ఉద్దేశం. బంధువులు, స్నేహితులు విడిచిపెట్టేసిన వేళ చివరకు ప్రభుత్వమూ పట్టించుకోనప్పుడు బాధితులకు ఈ స్తూపం ద్వారా ఒక ధైర్యం, ఒక భరోసా అందుతుంది. అందాలి.
ఆఖరి ప్రయాణంలో నన్ను తప్పించారు...
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తలపెట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమానికి బయల్దేరిన రాజశేఖరరెడ్డికి అదే చివరి ప్రయాణమైంది. అడుగడుగునా వెన్నుతట్టి నిలబడ్డ ఆయన ఎందుకో ఆ చివరి ప్రయాణంలో నన్ను వద్దన్నారు. నిజానికి చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న నేను కూడా ఆ హెలికాప్టర్‌లో వెళ్లాల్సింది. కానీ టెక్కలి ఉపఎన్నికలకు గడువు తొమ్మిది రోజులే ఉండటంతో ఆ బాధ్యతలు చూడాలని చెప్పి నన్ను రావద్దన్నారు. అదే ఆయన చివరి మాట! మా ఆత్మీయ నేత దూరమయ్యాడంటే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక ఆత్మీయుడిలా చూసుకున్న రాజశేఖరరెడ్డి కుటుంబంపై మా అభిమానం చెక్కుచెదరదు.
పేదవారి కోసం వచ్చావని అందామె..! : ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ
అది 1991 మార్చి ఆరు... పార్లమెంట్ సెంట్రల్ హాల్... రాజీవ్ గాంధీ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ ఇంటి వద్ద హర్యానా పోలీసులిద్దరిని రాజీవ్ గాంధీ సెక్యూరిటీ గుర్తించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు 1991 మార్చి 6న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర స్థాయిలో ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజీవ్‌గాంధీపై నిఘా పెట్టించారా? వారు అక్కడ ఎందుకు ఉన్నారంటూ గొడవ చేశారు. వెంటనే బయటకెళ్లిన చంద్రశేఖర్... తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి ఎన్నికలు జరిగి 14 నెలలే అయింది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్ (క్యాంటిన్)లో కూర్చున్నారు. ‘చంద్రశేఖర్ రాజీనామా చేశారు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?’ అంటూ చర్చించుకుంటున్నారు.
హాల్ అంతటా గందరగోళం. ఆహారం కోసం ఓ బిహార్ ఎంపీ సర్వర్‌ను పిలిచాడు. ఆ గందరగోళం, పని హడావుడిలో అతనికి వినిపించకపోవడం లేదా గమనించకపోవడం జరిగింది. రెండోసారి పిలిచినా అదే పరిస్థితి. దీంతో బిహార్ ఎంపీకి చిర్రెత్తుకొచ్చి ఆ సర్వర్‌ను లాగి చెంపపై కొట్టారు. ఆ దెబ్బ శబ్దం సెంట్రల్ హాల్‌లో ప్రతిధ్వనించింది. అప్పటి వరకు ఎంపీల మధ్య చర్చోపచర్చలతో ఉన్న ఆ హాల్‌లో ఒక్కసారిగా పిన్‌డ్రాప్ సైలెన్స్.
నాలుగు బెంచీల దూరంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల మధ్య కూర్చొని ఉన్న వైఎస్ ఒక్క ఉదుటన లేచి నాలుగు అంగల్లో సర్వర్ వద్దకు వెళ్లారు. ‘ఏయ్.. ఇధరావో, ఇధరావో’ అంటూ ఆ బిహార్ ఎంపీని పిలిచారు. ‘సే సారీ టు హిమ్’ అన్నారు. ‘వాడు ఏం చేశాడో తెలుసా’ అని బిహార్ ఎంపీ ఏదో చెప్పబోతుంటే... వైఎస్ తన చేతితో బల్లపై టాక్‌మని కొట్టి ‘డోంట్ టాక్, ఫస్ట్ ఆస్క్ హిమ్ ఫర్ అపాలజీ. యూ హావ్ నో రైట్ టు టాక్’ అన్నారు. మొత్తం హాల్ అంతా నిశ్శబ్దమయిపోయింది. అప్పుడు ఓ పెద్దావిడ వచ్చి ‘పోయిందనుకున్నాను. నమ్మకమంతా పోయిందనుకున్నాను. ఈ దేశంలో ఇక పేదవాడిని ఏం చేసినా అడిగేవారెవరూ ఉండరనుకున్నాను. నువ్వు ఒక్కడివి కనిపించావు అడిగేవాడివి’ అన్నారు.
తర్వాత ఆవిడ ఎవరని నేను విచారించాను. ఆమె బిహార్‌కు చెందిన మాజీ ఎంపీ తారకేశ్వరీ సిన్హా అని తెలిసింది. ఆ తర్వాత ఎంపీలందరూ వైఎస్‌కు మద్దతుగా వచ్చారు. అప్పుడు బిహార్ ఎంపీ ‘సారీ నేను ఎదో అవుట్ ఆఫ్ మూడ్‌లో ఉన్నాను’ అని ఏదో చెప్పబోతుండగా సర్వర్ ‘నాదే తప్పు సార్’ అన్నాడు. అప్పుడు వైఎస్ కలుగజేసుకుని ‘ఇక్కడ నీ పని నువ్వు చేస్తున్నావు. మా పని మేము చేస్తున్నాము. ఇక్కడ ఎవరూ ఎవరి కన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. పార్లమెంట్‌లో మేమే ఒకరిని కొట్టే పరిస్థితి వస్తే ఈ దేశంలో పరిస్థితి ఏమిటి? నువ్వేమీ ఫీల్ అవకు’ అంటూ సర్వర్‌ని సముదాయించారు. తర్వాత కొద్దిసేపటికి ఆ బిహార్ ఎంపీ వచ్చి ‘రాజశేఖరరెడ్డి.. ఆ యామ్ సారీ. ఇందాక నేను ఏదో మూడ్‌లో ఉండి అలా చేశాను’ అన్నారు. ‘‘ఓకే... అది నా ఇమిడియట్ రియాక్షన్. ఆ యామ్ ఆల్‌సో సారీ’’ అంటూ వైఎస్ కూడా హుందాగా బదులిచ్చారు.
ప్రేమానురాగాల దేవుడు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగింది. జిల్లాలోని ఫ్లోరోసిస్‌బాధితులను చూసి ఆయన చలించిపోయారు. ఈ మహమ్మారి నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పించాలంటే శ్రీశైలం నుంచి సొరంగం ద్వారా కృష్ణా జలాలు ఇక్కడకు తేవాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగానే ఆయన ఉన్నప్పుడే శ్రీశైలం సొరంగమార్గం తవ్వకాలకు బీజం పడింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండలో రైల్వే ఫై్లఓవర్ వైఎస్‌హయాంలోనే వచ్చాయి. లక్ష ఎకరాలకు నీరందించేందుకు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు రూ.700 కోట్లు వైఎస్ కేటాయించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని అప్పట్లో 46 డిపోలను ఎత్తివేస్తూ ఉత్వర్వులు వచ్చాయి. అందులో నార్కట్‌పల్లి డిపో కూడా ఉంది.
అయితే ఈ డిపో నిజాం కాలం నాటి నుంచి ఉందని, దీన్ని మూసి వేయవద్దని.. నా వాదనను వైఎస్ ముందు వినిపించా. దీని ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న ఆయన ఎత్తివేత నుంచి మినహాయింపు ఇప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచిన వైఎస్ మరణం నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. ప్రజలను ప్రేమగా చూసే వైఎస్‌లాంటి మహానేత రాష్ట్రంలో ఎవ్వరూ ఉండరు. అందుకే ఆయన స్మారకంగా మా గ్రామం బ్రాహ్మణవెల్లంలలోనే .. ‘వైఎస్’ విగ్రహంతో పాటు పార్కు ఏర్పాటు చేశాం. వైఎస్‌ను ప్రజలు ఎప్పటికీ మరువరు.