డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి
జమ్మలమడుగు నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా నాయకులు ఫ్యాక్షన్ భూతాన్ని చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రజలు వారి నీచ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా.. ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేయిస్తా.. భూమిలేని వారికి ఒకటిన్నర ఎకరా భూమి ఇప్పిస్తా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తా.. అని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి తొలిసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నడాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు
ప్రశ్న: రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
జవాబు: ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. మొదట డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూ వచ్చాను. మా కుటుంబం 40 ఏళ్ల నుంచి కమలాపురం, ఎర్రగుంట్లలో రాజకీయాల్లో ఉంది. ఆ అనుభవంతో ఎన్నికల బరిలోకి దిగాను. చాలా ఆనందంగా ఉంది.
ప్రశ్న: ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
జవాబు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రచారం చేస్తున్నాను. ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపిన ప్రేమాభిమానాలు నాపై కూడా చూపిస్తున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.
ప్రశ్న: మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలు కలిసిపోయాం. గెలుపు మాదే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
జవాబు: ఓట్లు వేసేది.. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలు. మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల కలయికను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాం. జైలుకు వెళ్లాం. ఇప్పుడు వారిద్దరు కలిసిపోతే గ్రామాల్లో మేము కలిసి పనిచేసేది లేదంటూ బాహాటంగా చెబుతూ వస్తున్నారు. ఇద్దరు నాయకులు కలిసినా ప్రజల మద్దతు నాకే ఉంది. గెలుపు తథ్యం.
ప్రశ్న: ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నారు?
జవాబు: ఇంత వరకు ఉన్న నాయకులు కేవలం తమ స్వలాభం కోసమే రాజకీయాలు చేసుకున్నారు. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించి దాదాపు 20వేల మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాను. అంతేకాకుండా ఇళ్లు లేని నిరుపేదలకు కచ్చితంగా ఇంటి స్థలంతోపాటు, ఇంటి నిర్మాణం చేయిస్తాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి భూమి లేని రైతులకు ఒకటిన్నర ఎకరా భూమి ఇప్పించే బాధ్యత తీసుకుంటాను.
ప్రశ్న: జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారు?
జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంతకాలం ఫ్యాక్షన్‌ను అడ్డం పెట్టుకుని ఇరువర్గాల నాయకులు తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ఇద్దరు నాయకులు కలిసినా నా గెలుపునకు ఎలాంటి ఢోకాలేదు. ఇంత వరకు ఇద్దరు నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. రాజకీయం అంటే సేవ చేయడం. ఒక్కసారి ప్రజలు నాకు అవకాశం కలిస్తే నేను ప్రజలకు సేవ చేసి కనీసం 25 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా ఉండే విధంగా చేసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment