
సాక్షి, అనంతపురం : తెలుగు ప్రజల ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన ఘనత రాయలసీమ ప్రజలదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయని, చరిత్ర తెలిసి కూడా చంద్రబాబు తప్పులు చేశారని విమర్శించారు. మూడు పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని నిర్మించడం మంచిది కాదన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు పరిపాలనలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు మూడుసార్లు శంకుస్థాపన చేసినా..తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. రాయలసీమ కరవు పై చంద్రబాబు, అయన కుటుంబ సభ్యులు ఎందుకు జోలె పట్టలేదని, ఆ సమయంలో రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. (మూడు రాజధానులకు మద్దతుగా అనంతలో భారీ ర్యాలీ)
దేశమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన వైపు చూస్తోందని, రాష్ట్ర సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఏపీ లేదని,అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి అత్యవసరమని అన్నారు. వైఎస్సార్ కృషి వల్ల రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, సమాంతర కాలువ ద్వారా పది వేల క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని, జీఎన్ రావు, బోస్టన్,శివరామకృష్ణయ్య కమిటీలు అధికార వికేంద్రీకరణకు సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా జేసీ, ఇతర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. గ్రేటర్ అమరావతిలో నారాలోకేష్ ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
చదవండి: 'ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా'
అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
కరవు కాటకాలకు చంద్రబాబు విధానాలే కారణమని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని, హంద్రీనీవా కాలువ వెడల్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని తెలిపారు. వృథాగా వెళ్తున్న వరద నీటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రణాళికలు వేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే లతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికల కు వెళ్లాలని, బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
అప్పుడెందుకు బాబు రోడ్లు ఎక్కలేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. రాయలసీమ వెనుకకబాటుకు చంద్రబాబే కారణమని, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అదే విధంగా రాయలసీమ కరవుపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు జరిగినప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబం ఎందుకు రోడ్లు ఎక్కలేదని, అమరావతి కోసం ఎందుకింత తాపత్రయమని ప్రశ్నించారు. అయిదేళ్ళ టీడీపీ పాలనలో అమరావతి ఎందుకు నిర్మించలేదని, రాజధానిలో ఎందుకు శాశ్వత నిర్మాణాలు జరపలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిపుణుల కమిటీలను అధ్యయనం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని, ఏపీలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కన్నారు.
Comments
Please login to add a commentAdd a comment