
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తలను ఖండిస్తున్నామని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అందుబాటులో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు శుక్రవారం కేంద్రకార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి, అంబటిరాంబాబు, పార్ధసారథిలు మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తమ అధినేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేశారని ఈ సందర్భంగా భూమన వ్యాఖ్యానించారు. ఈ దాడి పట్ల డీజీపీ, టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వతంత్ర విచారణ సంస్థతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, గవర్నర్‌లు కలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా నేరచరిత్రేనని, తమ పార్టీపై బురద జల్లేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్దంగా ఉన్నప్పటికీ గాయం కారణంగా కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరామని భూమన పేర్కొన్నారు.
ఆ వార్తలు అవాస్తవం: పార్థసారథి
ఏపీ పోలీసులను వైఎస్ జగన్ అవమానించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పార్థసారథి స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తున్నామన్నారు. తాము తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదన్నారు. ఇక అధికారులను తామెక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు మాటలు అభ్యంతరకరమన్నారు. దేన్నైనా చంద్రబాబు మసిపూసి మారేడు చేస్తారని, అందుకే తాము స్థానిక దర్యాప్తును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ముద్దాయిలను కాపాడటానికే చంద్రబాబు, డీజీపీలు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment