మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న దొంగ దీక్షల తీరు తేటతెల్లమైందని, ఇక వారిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు కిలోల బరువు తగ్గడానికి దీక్షలు చేస్తానని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అంటే, హోదానా గీదానంటూ అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించి వారి దొంగ దీక్షల గుట్టును విప్పారన్నారు. సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సాధించేందుకు తాము చిత్తశుద్ధితో దీక్షలు చేస్తున్నామంటూ ప్రగడ్భాలు పలుకుతున్న తీరును ప్రజ లు నిశితంగా గమనిస్తున్నారన్నారు. నాలుగేళ్ల పా టు కేంద్రంతో మిత్రపక్షంగా మెలిగి, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నంత కాలం నోరెత్తకుండా పబ్బం గడిపారని ఆరోపించారు.
కొత్త డ్రామాలకు సీఎం తెర..
రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కొత్త డ్రామాలకు చంద్రబాబు తెరలేపారని అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. రైల్వే జోన్ కోసం దీక్షల పేరిట భారీ సెట్టింగ్‌లతో వేదికలు వేసి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీలకు ఢిల్లీ వీధుల్లో తిరిగే ధైర్యం లేక విశాఖ గల్లీలో తూతూ మంత్రపు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారికి ఢిల్లీలో దీక్షలు చేసే సత్తా లేకే విశాఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం ముందు సినీ సెట్టింగ్‌లను తలదన్నే రీతిలో సెట్ వేసి బూటకపు దీక్షలు చేసి ప్రయాణికులకు, ప్రజలకు అసౌకర్యం తలపెడుతున్నారని ఆరోపించారు.
పవన్‌కల్యాణ్‌వి అవగాహన రహిత వ్యాఖ్యలు..
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేకుండా వైఎస్సార్‌సీపీపై అవాకులు చెవాకులు విసురుతున్నారని అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. టీడీపీ గెలుపునకు బాటలు వేసి, కేంద్రానికి మద్దతిచ్చి నాలుగేళ్లగా వారి సహవాసం చేసినప్పుడు చోడవరం సుగర్ ఫ్యాక్టరీ గురించి పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చోడవరం సుగర్ ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంటే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని గుర్తుచేశారు. అధికార పార్టీ అడుగులు మడుగులొత్తి పవన్ ఎన్నికల్లో తన హవాను మళ్లీ చాటుకునేందుకు టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆ మేరకే వైఎస్సార్‌సీపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతోందన్నారు.
వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్న విషయం ఇప్పటికే పవన్‌కల్యాణ్‌కు స్పష్టమైందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించి అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలో టీడీపీని దానికి మద్దతిస్తున్న పార్టీలను రాష్ట్రం నుంచి జనం తరమి కొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అనకాపల్లి సమన్వయకర్త వరుధు కల్యాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్, షరీఫ్, బర్కత్ ఆలీ, రామన్నపాత్రుడు, శ్రీనివాస్ గౌడ్, కాంతారావు, తడ్డబారికి సురేష్, బాబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment