సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, జయలలితల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయని, ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయోపిక్ కూడా తీస్తే ‘మహానగరంలో మాయగాడు‘.. ‘యూటర్న్ మోసగాడు’ అనే పేర్లు పెట్ట వచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బాలశారి ఎద్దేవా చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
9 శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లతో కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. మ్యానిఫెస్టో అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్ట్ కట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని, హైకోర్టు కట్టలేక సాకులు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ పోరాట దీక్షకు అర్ధం లేకుండా చేశారని దుయ్యబట్టారు. గతంలో సోనియాను దెయ్యమన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆమె అలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, ఒంటరిగా పోటీ చేసే సత్తా తమ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి ఉందన్నారు.
అప్పుడెందుకు ముసిముసిగా నవ్వావు?
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల్లో భావం కరెక్ట్‌గానే ఉందని, జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు చంద్రబాబు ఎందుకు ముసిముసిగా నవ్వాడని, ఇది మీ సంస్కారమా? అని ప్రశ్నించారు. అప్పుడు జేసీ వ్యాఖ్యలను ఎందు ఖండించలేదని నిలదీశారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు నాయుడి తీరును ప్రస్తావిస్తూ.. ఘాటైన విమర్శలు చేయడం.. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ కేసీఆర్ సభ్యత లేకుండా మాట్లాడారని వ్యాఖ్యానించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment