
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు అండర్‌గ్రౌండ్‌లో ఉంటారా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. బొత్స మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగు రోజులు అవుతున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు ఢిల్లీలో పోరాటం చేయడం లేదని నిలదీశారు. ప్రజల ముందుకు చంద్రబాబు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్నారని, వారు మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలని బొత్స సూచించారు.
నాలుగేళ్లు బీజేపీతో సహవాసం చేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారని బొత్స ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలపై చంద్రబాబు కావాలంటే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకోవాలన్నారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విభజన హామీల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బొత్స స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment