
సాక్షి, విజయనగరం : నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 11న విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువగర్జన నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు ఆ పార్టీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో 600కి పైగా హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అవేమీ నెరవేర్చలేదని విమర్శించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. యువత ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భృతి కోసం ఇంతకాలం వేచిచూస్తే.. మంత్రి వర్గం 1000 రూపాయలు ఇవ్వాలని, వయోపరిమితి విధించాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ ఖండిస్తుందని తెలిపారు.
నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇవ్వడంతో పాటు.. హామీ ఇచ్చిన నాటి నుంచే వర్తించేలా నిర్ణయం తీసకోవాలని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం కూడా టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తించేలా కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. మారిపోయారని నమ్మి ఓట్లేసిన ప్రజలను, ఉద్యోగులను తిరిగి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శించారు. ప్రత్యేక హోదా తేవాల్సిన టీడీపీ నాలుగేళ్లు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని.. ఇప్పుడు ఎన్నికల సమయం రావడంతో ధర్మ పోరాటం అనడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment