అవినీతి, అక్రమాలతో ప్రజల పొట్ట కొట్టి కూడబెట్టుకున్న డబ్బుతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తూ సంబరాలు చేసుకోవడం ఇక ఎంతో కాలం కొనసాగదని,
♦ సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నాయకుల సవాల్
♦ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య
♦ అవినీతి సొమ్ముతో దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శ
గజపతినగరం రూరల్ : అవినీతి, అక్రమాలతో ప్రజల పొట్ట కొట్టి కూడబెట్టుకున్న డబ్బుతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తూ సంబరాలు చేసుకోవడం ఇక ఎంతో కాలం కొనసాగదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని భూ స్థాపితం చేస్తారని సాలూరు ఎమ్మెల్యే పీడీక రాజన్నదొర వ్యాఖ్యానించారు. సోమవారం గజపతినగరంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ప్లీనరీలో చేసిన తీర్మానాలను, పార్టీ చేయబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో దొరికి పోయి, అక్రమంగా డబ్బులు సంపాదించి, కొడుకును దొడ్డిదారిన మంత్రిని చేసిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. బాబు తాను చేసిన అభివృద్ధిపై నమ్మకముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
టీడీపీ వారు నారా లోకేష్‌కు, వైఎస్ జగన్‌కు పోలిక పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబుకు వెన్ను పోటు రాజకీయాలు తెలిసినందునే పార్టీ ఫిరాయింపులకు ప్రా ధాన్యమిచ్చి ఇతర పార్టీలోనుంచి వచ్చిన వారిని మంత్రిని చేశారని విమర్శించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన మాట్లాడుతూ తోటపల్లి కెనాల్‌కు రూ.700 కోట్లు విడుదల చేసి వైఎస్ రాజశేఖరెడ్డి రైతులకు ఆసరాగా నిలిస్తే టీడీపీ పది శాతం నిధులు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు.
ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి ఇళ్లు, ఆరోగ్య శ్రీ లాంటి సంక్షేమ పథకాలు భరోసా నిస్తే ఇప్పుడు ఆ పథకాలు ఎక్కడ కనిపించడం లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ రాజధాని పేరుతో విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా విచారణలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష నేత పరామర్శకు వెళ్తే కేసులు పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు.