
సాక్షి, విశాఖపట్నం : తెలంగాణలో ఎందుకు ఓడిపోయామో చెప్పని చంద్రబాబు, ఉత్తరాదిలో మాత్రం తన వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పడం దౌర్భాగ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలిసి ఉంటామని చెప్పారే తప్ప.. చంద్రబాబులా పూటకో మాట మార్చే నైజం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిది కాదని పేర్కొన్నారు. తనకు గిట్టని వారినందరినీ వైఎస్ జగన్‌తో ముడిపెడుతూ చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఒక పద్ధతి ప్రకారం, దివంగత మహానేత వైఎస్సార్‌లాగా హుందాగా వ్యవహరిస్తారని తెలిపారు.
తగిన బుద్ధి చెప్పారు...
విశాఖ ప్రజల దాహార్తిని తీర్చడానికి టీడీపీ, బీజేపీలు ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదని ప్రసాద్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించి ప్రపంచంలో మరో ముఖ్యమంత్రి లేరని.. ఆయన అబద్ధాలకు తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా వీల్లేకుండా తెలంగాణ సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.