వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో గంటకో అత్యాచారం జరుగుతోందని, దివ్యాంగులను సైతం టీడీపీ నేతలు విడిచి పెట్టడం లేదంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ మండిపడ్డారు. కశ్మీర్‌లో జరిగిన ఘటనపై స్పందిస్తారు.. కానీ మంగళవారం రాజధానిలో జరిగిన దారుణం సీఎం చంద్రబాబు దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన దారుణాలపై స్పందించే చంద్రబాబు.. సొంత రాష్ట్రం ఏపీలో జరిగిన ఏ ఘటనపై కూడా స్పందించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
గుంటూరులో నిన్న ఒంటరిమహిళపై దారుణానికి ఒడిగడితే మీ దృష్టికి రాలేదా ? బెల్లంకొండలో 7 ఏళ్ల మూగ బాలికపై జరిగిన సంఘటన, పెసరలంకలో 7 ఏళ్ల బాలికపై, చిలకలూరిపేటలో మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. టీడీపీ నేతలు చింతమనేనిపై 27, దేవినేనిపై 13 కేసులు ఉన్నాయి. కొల్లు రవీంద్ర, కేఈ కృష్ణమూర్తి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, నక్క ఆనందరావు, కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమ, వేద వ్యాస్ లపై వివిద జీవోల ద్వారా కేసులు ఎత్తివేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం.. జైలుకు వెళ్తానన్న భయంతో తనను రక్షించాలని ప్రజలను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిలో ప్రపంచంలోనే చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని ఆరోపించారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో, దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉన్నది నిజం కాదా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. మహిళలకు కనీస భద్రత కల్పించలేని దద్దమ్మ పాలన అవసరమా అని మహిళలు దీనిపై ఆలోచన చేయాలంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేత పద్మజ పిలుపునిచ్చారు
Comments
Please login to add a commentAdd a comment