సాక్షి, విజయవాడ : తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు సర్కార్ బురద జల్లుతోందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. ‘ఉపాధి హామీ పనులను వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు అడ్డుకుంటున్నారనేది అవాస్తవం. ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. టీడీపీ నేతల జేబులు నింపడం కోసమే...ఉపాధి హామీ పనులను యంత్రాలతో చేయిస్తున్నది వాస్తవం కాదా?. మేం పేదల తరఫున మాట్లాడితే అభివృద్ధికి అడ్డుపడినట్లా?. ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు బయటపెడితే మాపై నిందలా?. మీకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి. లేదా జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించండి’ అని ఆయన డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లు, టీడీపీ నేతల జేబులు నింపేందుకే చంద్రబాబు పని చేస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఉపాధి పనులు లేక ప్రజలు పొట్టచేతబట్టుకొని దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంతో పేదలు గౌరవంగా బతికేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే...బాబు మాత్రం పేదల పొట్టగొడుతూ నిధులను పచ్చచొక్కాలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. బాబు అధికారంలోకి వస్తూనే ఆగస్టు 12 2014న ఉపాధి హామీ పథకం పనుల్ని ఆపమని మెమో ఇచ్చిన ఘనుడని దుయ్యబట్టారు. ఆ రోజు ఉపాధి హామీ పథకం జరిగిన తీరుతెన్నులపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పింది వాస్తవం కాదా..?అని బాబును నిలదీశారు.
ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు చేస్తే..నిధులు రాకుండా అడ్డుపడుతోందంటూ చంద్రబాబు నానా యాగీ చేయడం సరికాదన్నారు. ఉపాధి పనుల్లో 146కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని, దీనికి ఏం సమాధానం చెబుతారని బాబును, మంత్రులను ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ కూడ వైఎస్‌ఆర్ సీపీ రాసిందని చెబుతారా..? అంటూ ధ్వజమెత్తారు. కేంద్రానికి సంబంధించిన ఇండిపెండెంట్ బాడీ కూడా ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పిందన్నారు. 2016కు సంబంధించిన ఉపాధి హామీ పనుల్లో 350కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను మీడియా ముఖంగా పార్థసారధి చూపించారు. వాళ్లు రాస్తే ఏమనిపించదు గానీ...తాము ఆ తప్పుల్ని ఎత్తిచూపితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని పాట పాడతారా..? అని సూటిగా ప్రశ్నించారు.
రెండున్నరేళ్లలో పదిలక్షల మంది వలస వెళ్లారని పత్రికల్లో వస్తుంటే దాన్ని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని చంద్రబాబును నిలదీశారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తమ నాయకుడు వైఎస్ జగన్ నిలదీశారని పార్థసారధి గుర్తు చేశారు. ‘ప్రధాని కుర్చీ నా చేతిలో ఉందని తొడలు గొట్టారే గానీ.... వలసలను ఆపాలని గానీ, పేదవాళ్ల కడుపు నింపాలని గానీ ఏనాడైనా ప్రయత్నించారా బాబూ’ అని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ తన హయాంలో అత్యధికంగా ఉపాధి హామీ పథకం నిధులు తీసుకొచ్చి పేదలు గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించారన్నారు. చివరకు చంద్రబాబు ఎంత నీచానికి దిగజారారంటే... 13 లక్షల ఇళ్లు ఉపాధి హామీ పథకం కింద కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తే వాటిని కూడా ఆపేశారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment