
సాక్షి, ఏలూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో బాబుల బాక్సులు బద్దలైపోయాయని, ఇంకేమైనా మిగిలి ఉంటే బీసీ గర్జన సభతో అవి కూడా పగిలిపోతాయని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో పార్థసారథి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రత్యేక హోదా రాకుండా మోసాలు చేశారని, ఆ మోసాల నుంచి తప్పించుకునేందుకు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
బీసీల అభివృద్ధి కోసమే బీసీ గర్జన సభను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల ఎంతోమంది బీసీలు అభివృద్ధి చెందారని, వైఎస్సార్ వల్ల బీసీల్లోనూ ప్రతి ఇంట్లో డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని గుర్తు చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బీసీలు తలెత్తుకొని బతకగలరని, బీసీల హక్కులు కాపాడాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ద్వారా ఆ పాలనను మళ్లీ రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ పాలనలో ప్రజలు ఆత్మాభిమానంతో జీవించారన్నారు. ప్రజలందరూ సామాజిక గౌరవాన్ని పొందేవిధంగా వైఎస్‌ఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారన్నారు.
ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా?
చంద్రబాబు పాలనలో ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. చంద్రబాబు బీసీలను దూషించారని గుర్తు చేశారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ధర్మాన స్పష్టం చేశారు. గ్రామగ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకం గురించి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ధర్మాన సూచించారు. బీసీలంతా వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.