
సాక్షి, అనంతపురం : సీఎం చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అసాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య జోస్యం చెప్పారు. జైలుకు వెళ్తానన్న భయం ఆయనలో కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అవినీతి, అక్రమాలపై విచారణ జరిగి తీరుతుందన్నారు. మూడు లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నిర్వహిస్తున్న టెలీకాన్ఫరెన్స్ వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. సీఎం మానసిక స్థితి సరిగాలేదని అందుకే ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో ఏపీ అవినీతిలో నంబర్ వన్‌గా మారిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ సమస్యను నిమిషంలో పరిష్కరించవచ్చని కానీ వాటి ఆస్తులపై కన్నేసినందునే చంద్రబాబు పరిష్కరించటం లేదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
శారదా కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని.. ఈ క్రమంలో ఆమె చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతివ్వడం సరికాదన్నారు. ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించడం సరికాదన్నారు. నలుగురు మంత్రులను కూడా వైఎస్సార్ సీపీ జాబితాలో పేర్కొనటం పట్ల రామచంద్రయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment