తమ్మినేని సీతారాం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అంటూ కొత్త నాటకం మొదలు పెట్టారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లేది రాష్ట్రం కోసం కాదని, సొంత ప్రయోజనాల కోసమన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో తొమ్మిది రోజులుగా అవిశ్వాసం కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిది రాజకీయ పార్టీలు, వంద మంది ఎంపీలు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు పెట్టారు. అయినా అవిశ్వాసం ఇంతవరకు చర్చకు నోచుకోకపోవడం దురదృష్టకరం. వైఎస్ జగన్ పోరాటాన్ని మిగిలిన పార్టీలు కూడా నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాయి. ప్రత్యేక హోదా తెలుగుప్రజల హక్కు అని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతూనే వున్నారు. ఆయన ఆశయం, లక్ష్యానికి ఎంతోమంది మద్దతు తెలిపారు.
కానీ తెలుగుదేశం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలపై అనేక యూటర్న్ లు తీసుకుంటోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి అమరణదీక్షలు చేస్తామన్నారు. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఏం డైరెక్షన్ ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ టూరు కేంద్రంతో సంధి చేసుకోవడానికి కాదా? ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించి, ఆమరణ దీక్షలు చేయించాలి. ముఖ్యమంత్రి గా మీరు కూడా ఆమరణదీక్షకు సిద్దం అవ్వండి. అటు ప్రతిపక్షం, ఇటు అధికారపక్షం ఆందోళనకు దిగితే కేంద్రం తప్పక స్పందిస్తుంది. కానీ చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు. ఆయన డిల్లీ పర్యటనపై అనేక అనుమానాలున్నాయి. ఓటుకు నోటు కేసు... లోకేష్ పై మనీ ల్యాండరింగ్ కేసులను చక్క బెట్టుకునేందుకే ఢిల్లీ వెళ్లున్నారు. ఏ రాజకీయ పక్షం చంద్రబాబును నమ్ముతుంది? మూడో ఫ్రంట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు టెంట్ ఊడిపోతోంది. హోదా అంటే కేసులు పెడతామని చంద్రబాబు బెదరించలేదా? ప్యాకేజీ అద్భుతంగా వుందని అనాడు చెప్పలేదా’ అని అన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ధి లేదు
అటు కేంద్రం కూడా అవిశ్వాసంపై చర్చ జరగకుండా కొన్ని పార్టీల ఎంపీలను పావులుగా వాడుకుంటోంది. కేంద్రానికి చిత్తశుద్ధి వుంటే.. గొడవ చేసే పార్టీల నేతలతో బీఏసీ పెట్టి చర్చించవచ్చు. స్పీకర్ ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ద్రవ్య వినిమయ బిల్లును ఏవిధంగా ఆమోదించుకున్నారు? కేంద్రానికి ఒక న్యాయం... మిగిలిన పార్టీలకు ఒక న్యాయమా? రాష్ట్ర విభజన బిల్లును తలుపులు మూసి ఆమోదించారు. అప్పుడు సభ ఆర్డర్‌లో వుందా? బీజేపీ, టీడీపీలు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. నిజాలేమిటో చర్చకు రావాలంటే పార్లమెంట్‌లో అవిశ్వాసానికి అవకాశం ఇవ్వాలి. సభలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’ అని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment