
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకున్నారని మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో తోపుదుర్తి విలేకరులతో మాట్లాడుతూ.. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే వైఎస్సార్ సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనక సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ విచారణ అంటే భయపడుతున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగిన అర గంటకే పబ్లిసిటీ కోసమంటూ డీజీపీ చెప్పటం దారుణమన్నారు. తాము తలచుకుంటే కైమా చేసేవాళ్లం అంటూ మంత్రులు, ఎంపీలే వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవుతుందన్న భయంతోనే జగన్‌పై హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైఎస్ జగన్‌ను చంపేందుకు పక్కా ప్లాన్ జరిగిందని, అదృష్టవశాత్తూ అది విఫలమైందని పేర్కొన్నారు. కేసును తప్పు దాడి పట్టించేందుకే ప్రభుత్వ పెద్దలు దొంగ ఫ్లెక్సీలు విడుదల చేశారని ఆరోపించారు.