సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పోలవరం ప్రాజెక్టు కడుతూ.. తానే దానిని కడుతున్నాని చంద్రబాబు నాయుడు ప్రజలను మభ‍్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మలలీపట్నం పార్లమెంట్ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరానికి వెళ్లి హడావుడి చేసి తానే ఆ ప్రాజెక్టును కడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. దివంగనేత వైఎస్సార్‌పై నమ్మకంతో పోలవరం ప్రాజెక్టుకు రైతులు భూములు ఇచ్చారన్నారు. వైఎస్సార్ హయంలో ఆరువేల కోట్లు ఖర్చు చేసి పోలవరం కాలువలు తవ్విస్తే..ఇప్పుడు చంద్రబాబు వచ్చి మోటార్లు పెట్టి స్విచ్ ఆన్ చేసి అదే పట్టిసీమ అంటున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి చంద్రబాబు నాయుడు వంగి వంగి నమస్కారాలు పెట్టి పోలవరాన్ని లాక్కున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ మాదిరి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరానికి వెళ్లి లెక్కలు చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి ఒక్క పైసా అయినా కేటాయించారా అని ప్రశ్నించారు.
ఎప్పుడు ఎవర్ని తిడతాడో తెలియదు
చంద్రబాబు ఎవర్ని ఎప్పుడు తిడతాడో, ఎవర్ని ఎప్పుడు పొగుతాడో తెలియని అయోమయ పరిస్థితులలో టీడీపీ నేతలు ఉన్నారని బాలశౌరి ఎద్దేవా చేశారు. సోనియా గాంధిని దెయ్యం అని తిట్టి..నేడు దేవత అని పొగుడుతున్న ఘనత చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. నరేంద్ర మోదీ హైదరాబాద్‌కి వస్తే అరెస్ట్ చేయిస్తానన్న చంద్రబాబు.. మోదీ మాత్రమే ఈ దేశానికి ప్రధాని కావాలని ప్రకటించారని గుర్తు చశారు. చంద్రబాబు తీరువల్ల టీడీపీ నేతలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
తప్పు చేయకపోతే విచారణకు అంగీకరించండి
ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ తప్పు చేయలేదని చంద్రబాబు భావిస్తే ... ఆ కేసుపై ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించాలని బాలశౌరి సవాల్ చేశారు. కోర్టు ఈ కేసును ఎన్‌ఐఏకి ఇస్తే గుమ్మడికాయల దొంగ ఎవరంటే చంద్రబాబు అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి ఉందన్నారు. పరిటాల రవి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తే 24 గంటల్లో సీబీఐ దర్యాప్తుకు అప్పజెప్పిన ఘనత వైఎస్సార్‌దని ప్రశంసించారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే వైఎస్సార్ అలా చేశారన్నారు. టీడీపీ తప్పు చేయలదేని భావిస్తే ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించాలన్నారు.
ఇసుక, మట్టి విచ్చలవిడిగా దచుకుంటున్నారు
రాష్ట్రంలో టీడీపీ నేతలు ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని బాలశౌరి ఆరోపించారు. ‘తెలంగాణలో ఇసుకపై ఆదాయం గతంలో రూ.100కోట్లు వస్తే..ఇప్పుడు దానిని రూ. రెండు వేల కోట్లకు పెంచారు. ఆ రాష్ర్టం కంటే మన రాష్ర్టంలో నదులు ఎక్కువ.అలా చూస్తే కనీసం మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి. అదంతా మీ అనుచరులకు కట్టబెట్టిన విషయం వాస్తవం కాదా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ లు పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులలో దోచుకుంటుంటే, ఎమ్మెల్యేలు,మంత్రులు ఇసుక మట్టిలో దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత దోపిడికి పాల్పడిన చంద్రబాబుకు తెలంగాణలో ఎలాంటి తీర్పు వచ్చిందో..అదే తీర్పు ఏపీలోనూ వస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment