బ్రాహ్మణులను చులకనగా చూడకు.. | YSRCP Leaders fires on Chandrababu | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణులను చులకనగా చూడకు..

Published Sun, Dec 16 2018 4:36 AM | Last Updated on Sun, Dec 16 2018 4:36 AM

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోన రఘుపతి, చిత్రంలో పార్టీ నాయకులు మల్లాది విష్ణు  - Sakshi

సాక్షి అమరావతి: బ్రాహ్మణులు ఏం చేస్తార్లే అనే దురహంకారం, చులకన భావంతో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు. వారి జంధ్యం పోగులే టీడీపీ ప్రభుత్వానికి ఉరి తాళ్లుగా మారుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ వేధింపులు భరించలేక ఫణికుమారాచార్యులు అనే అర్చకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గురువు స్థానంలో ఉంచి గౌరవించాల్సిన అర్చకుడిని.. ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కర్నీ మోసం చేశారని దుయ్యబట్టారు. చివరకు భగవంతుడిని కూడా రాజకీయాల కోసం వాడుకునే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడని విమర్శించారు.

మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అధికారుల ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. అర్చకుల వంశపారంపర్య హక్కుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని పేర్కొన్నారు. వారికి శక్తి ఉన్నంతకాలం అర్చకులుగా కొనసాగవచ్చని కోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా.. ప్రభుత్వం బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పును గౌరవించి వంశపారంపర్య హక్కును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 76ను అమలు చేస్తూ అర్చకులు వంశపారపర్యంగా కొనసాగే హక్కును కల్పించారని కోన రఘుపతి గుర్తు చేశారు. ఆ జీవో అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రాహ్మణులెవరూ ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. 

టీడీపీ ప్రయోజనాల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్‌..
టీడీపీ ప్రయోజనాల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు తప్ప.. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు కాదని కోన విమర్శించారు. ఇప్పటికీ పేద బ్రాహ్మణ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అత్యంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుష్కరాల్లో వందల ఆలయాలను కూల్చివేశారని మండిపడ్డారు. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాల్లో వివాదాలు నెలకొన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యులు సైతం అర్చకులను వేధిస్తున్నారన్నారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక ఇద్దరు అర్చకులు ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రభుత్వ తీరును నిరసించినవారిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే దేవాలయ వ్యవస్థలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement