
అమరావతి: ఓడిపోతామన్న భయంతో భావోద్వేగాలను , ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఆదివారం నాగిరెడ్డి, గౌతం రెడ్డిలు కలిశారు. తన వాయిస్ ఇమిటేట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర పన్నారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి తరపున సీఈఓకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. ఏబీఎన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయ రెడ్డి వాయిస్‌ను ఇమిటేట్ చేసిన టేప్ ప్రసారం చేశారని వెల్లడించారు. అది తన వాయిస్ కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేసినా ఏబీఎన్ అడ్డదారి తొక్కటం దారుణమన్నారు.
మోసపూరిత విధానంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ జేబు మీడియా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మిమిక్రీ ఆర్టిస్టులతో వాయిస్ ఇమిటేట్ చేసి దుష్ప్రచారం చేస్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. టీడీపీకి ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల ప్రక్రియ అన్నా గౌరవం లేదన్నారు. ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్‌ల్లోకి తెలుగు తమ్ముళ్లు చొరబడి లొల్లి చేస్లున్నారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే పథకాల అమలు కోసం మళ్లీ వచ్చే ఎన్నికల వరకు ఆగాలన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఎన్నికలు వస్తే తప్ప చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావన్న విషయం అందరికీ అర్ధమైపోయిందని చెప్పారు. ఎన్నికుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా జగన్ జనసునామీలో కొట్టుకుపోకతప్పదని వ్యాఖ్యానించారు.