వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగువారి పౌరుషాన్ని చాటేందుకే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని తమ పార్టీ ఎంపీలు సిద్ధపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ సాక్షిగా ఏప్రిల్ ఆరో తేదీన ఎంపీ స్థానాలకు రాజీనామా సమర్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు.
టీడీపీకి చెంప పెట్టు: వైవీ సుబ్బారెడ్డి
నాటకాలతో ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి తమ రాజీనామాలు చెంపపెట్టని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ పలు ఆందోళనలకు సిద్ధమైందని, దీనికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. మార్చి ఒకటిన కలెక్టరేట్ల ముట్టడి, 5వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. అప్పటి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే పార్లమెంట్ సాక్షిగా ఎంపీ పదవులకు రాజీనామా చేసి వస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము రాజీనామాలు చేస్తుంటే... పార్లమెంట్‌లో టీడీపీ డ్రామాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు.
అజ్ఞాతమెందుకు బాబూ?: బొత్స
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చంద్రబాబు తన వైఖరిని వెల్లడించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. గత 14 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉండటానికి కారణాలేమిటని నిలదీశారు. మిత్రపక్షమైన బీజేపీని చూసి చంద్రబాబు వణికి పోతున్నారని తెలిపారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే అడిగే బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల విషయంలో తమ నేత జగన్ స్పష్టమైన విధానంతో ఉన్నారని తెలిపారు. విభజన చట్టంలోని హామీల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని చెప్పారని, ఆ మేరకు పలు సందర్భాల్లో ప్రధాని, రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల నాయకులతో కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. ఢిల్లీలో ధర్నా చేశామని, గుంటూరులో తమ నేత జగన్ అమరణ నిరాహార దీక్ష చేశారని, విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, యువభేరిలు చేపట్టామని వివరించారు.తాము నాలుగేళ్ళుగా ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న మేలు మరే రాష్ట్రానికి లేదని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికైనా తమ నేత చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని టీడీపీని బొత్స కోరారు.
Comments
Please login to add a commentAdd a comment