
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం గురువారం జరగనుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా... వద్దా? అనే అంశంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ నెల 23న అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ నిర్వహించిన భేటీలో.. అధికారపక్షం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శాసనసభా సమావేశాలను బహిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తమైన విషయం తెలిసిందే. దీనిపై గురువారం తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ నేతల ముఖ్య సమావేశం నేడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని రావినారాయణరెడ్డి సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఆరు నెలలపాటు ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వెల్లడిస్తారు. ఈ నెల 11న జరిగిన విస్తృత సమావేశంలో జగన్ పార్టీ నేతలనుంచి ఇదే అంశంపై అభిప్రాయాల్ని తెలుసుకున్నారు.
వాటి ఆధారంగా రూపొందించిన కార్యాచరణపై జగన్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతున్నారు.