
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదాపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీక్షాదక్షత చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అందుకే సీఎం దొంగ నాటకాలు, దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను చేసిన అవినీతికి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్తాననే భయం చంద్రబాబులో ఉందని, అందుకే అందరూ తనకు కాపలా ఉండాలని ప్రజలను అడుగుతున్నారంటూ అనిల్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి అందరికి తెలిసిపోయిందని, జైల్లో కూర్చోపెట్టే దాకా ప్రజలు ఎవరూ నిద్ర కూడా పోరని వ్యాఖ్యానించారు.
నాడు కాంగ్రెస్‌తో కుట్రపన్ని వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ కూడా సరైన వర్షాలు లేవని, చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడైనా చంద్ర గ్రహణం ఒక్క రోజే ఉంటుందని, కానీ ఏపీ ప్రజలకు మాత్రం ఐదేళ్లు చంద్రబాబు గ్రహణం పట్టిందని మండిపడ్డారు. మండే సూర్యుడిలా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి గ్రహణాన్ని తొలగించుకుందామంటూ పిలుపునిచ్చారు.
చంద్రబాబులాగా వెన్నుపోటు రాజకీయాలు వైఎస్ జగన్‌కు తెలియవని అనిల్ అన్నారు. చంద్రబాబు లాగా నీచపు రాజకీయాలు ఎప్పుడూ వైఎస్సార్ సీపీ జరపదని తెలియచేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు వైఎస్ జగన్‌ను తమ భరోసాగా భావిస్తున్నారని అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది వైఎస్‌ఆర్ సీపీ ఒక్కటేనని, ప్రత్యేక హోదా సాధనకు ప్రజలందరి ఆశీస్సులు అందించాలని కోరారు. వైఎస్ జగన్ అంటే కోట్లాది మంది గుండె చప్పుడు అని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ప్రజల జీవితాలు బాగుంటాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించే దమ్ము, ధైర్యం వైఎస్ జగన్ ఒక్కరికే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు హడావిడి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పుష్పవాణి, ముత్యాల నాయుడు, ముస్తఫా విమర్శించారు. కేసుల కోసం చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా హోదా ఊసెత్తని చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పోరాటాల వల్లే హోదా అంశం ఇంకా సజీవంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment