సాక్షి, తాడేపల్లి : రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా మూడు రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విమర్శించారు. టీడీపీ నేతలంతా అమరావతి ప్రాంతంలో ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. (రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం)
అభివృద్ధి వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబులా సీఎం జగన్ రెడ్డి గ్రాఫిక్స్ చూపించలేదని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడానికి మూలకారణం చంద్రబాబు నాయుడే అని విమర్శించారు. గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment