సాక్షి, పశ్చిమగోదావరి : తమ ప్రభుత్వంలో దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. దళితులపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. గురువారం ఆయన నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గత పది ఏళ్లలో చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలోని ఇసుకను, పోలవరం మట్టితో పాటు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ చింతమనేని చేసిన అరచకాలపై కేసులు పెడితే 200 పైనే నమోదు అవుతాయన్నారు. ఇప్పటికే ఆయనపై 35 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని విమర్శించారు.
దళితుల యువకులపై దాడి చేసినందుకు కేసు పెడిపెడితే అవి అక్రమ కేసులు అనడం సిగ్గు చేటన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తున్న దళితులపై చింతమనేని దారుణంగా దాడి చేశారన్నారు. చంద్రబాబు పాలనతో చింతమనేని అరాచకాలకు, ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయన్నారు. కానీ సీఎం జగన్ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవని హెచ్చరించారు. సెప్టెంబర్ 5నుంచి కొత్త ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా ఇసుక అందజేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ మైనింగ్ ఉండకూడదనే సీఎం జగన్ కొత్త విధానం తెచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment