సాక్షి, దెందులూరు: రాష్ట్రంలో తెలుగు డ్రామా పార్టీ మరోసారి డ్రామా మొదలు పెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఆయన గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. కుల, మతాలను అడ్డంపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అన్ని కుల,మతాల మద్దతు ఉండబట్టే వైఎస్సార్‌సీపీ 151 సీట్లు గెలిచిందన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తన కులాన్ని పేటేంట్ కులంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే దెందులూరులో వైస్సార్‌సీపీ ఘన సాధించిందని పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి వెనుక ఉన్న రఘురాం ఏ కులమో తెలియదా.. తాను లండన్‌లో ఉద్యోగం చేసుకునేవాడిని.. తనకు రాజకీయాల్లో అవకాశం కల్పించారు. తాన కులం ఏమిటో తెలియదా’ అంటూ టీడీపీ నేతలను అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. (అంపశయ్యపై ఉన్నా ఆరాటమేనా?)
మద్యం రేట్లపై బాపిరాజు మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. మద్యం రేట్లను ‘అమ్మ ఒడి’తో పోల్చుతున్నారని దుయ్యబట్టారు. గొప్ప ఆశయంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని తాగుబోతులతో పోల్చడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఎంతసేపు టీడీపీ మద్యం బాబుల గురించి మాట్లాడుతుందని.. తాము చిన్నారుల భవిషత్తు గురించి ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2,250 రూపాయల పింఛన్ ఇస్తున్నామని.. పింఛన్లపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు.
అధిక శాతం కమ్మ సామాజిక వర్గం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే ఉన్నారన్నారు. 2024లో టీడీపీకి కెప్టెన్ ఎవరో టీడీపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పదేపదే మీడియాకు ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్‌పై చేస్తున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని.. త్వరలోనే జిల్లా ప్రజల కలను సాకారం చేస్తామని పేర్కొన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేసేది ఒక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment