
సాక్షి, గంపలగూడెం: ఇసుక కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే రక్షణ నిధి మండిపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు, గోసవీడులో ఇసుక వారోత్సవాల్లో భాగంగా రెండు రిచ్‌లను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ నిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘ విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న దీక్ష.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని’ ఎద్దేవా చేశారు. దీక్షను చూసి రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారన్నారు. గత టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పేరిట జరిగిన దోపిడీ..రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.
ఇసుక పుష్కలంగా లభిస్తోంది..
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక పుష్కలంగా లభిస్తోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైస్ జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినప్పటికి, వక్ర బుద్ధి మాత్రం మారడం లేదన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని రక్షణనిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment