విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా
తిరుమల: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సినీ నటుడు శివాజీ కలిసి ఆపరేషన్ గరుడ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, ప్లాన్‌లో భాగంగానే శివాజీ అమెరికా పారిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేబినేట్ సమావేశంలో శివాజీ పాల్గొన్నారని వార్తలు కూడా వచ్చాయని చెప్పారు. టీడీపీతో సంబంధం లేకపోతే అతన్ని ఇంతవరకూ అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన మంత్రుల తీరు చూస్తుంటే వెగటు వేస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రజలకి, ప్రతిపక్షాలకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే అది ఒట్టి డ్రామా అని సీఎం చంద్రబాబు కొట్టి పారేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌పై జరిగింది హత్యాయత్నం అని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు, మరి ఇప్పుడు ఏమంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్‌వోసీ తీసుకుని ఎందుకు తన వద్ద పెట్టుకున్నాడో హర్షవర్దన్ చౌదరి చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసు సరైన మార్గంలో విచారణ సాగటం లేదు కనుకనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే ఎందుకు కుట్రకోణంలో విచారించటం లేదని చంద్రబాబుకు సూటిగా ప్రశ్నవేశారు. సోమిరెడ్డి ఒక సోంబేరి రెడ్డిలా తయారయ్యారని, ఐదుసార్లు ఓడిపోయినా, నెల్లూరు ప్రజలు ఛీకొట్టినా మంత్రి పదవి కట్టబెట్టి చంద్రబాబు వెర్రికూతలు కూయిస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి టీడీపీ నేతలు రౌడీల్లాగా, గూండాల్లాగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం, మంత్రులు దిగజారుడు మాటలు ఆపి, ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజాబలాన్ని ఓర్వలేకే టీడీపీ, ఆపరేషన్ గరుడను నడిపిస్తోందని అన్నారు. కేసులో కీలక నిందితుడైన శివాజీని అరెస్ట్ చేయకుండా, జగన్ కుటుంబ సభ్యులపై నిందలు వేయడం బాధాకరమన్నారు. వారి మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment