అనర్హత వేటు విధించండి | YSRCP MPs Comments at media conference | Sakshi
Sakshi News home page

అనర్హత వర్తిస్తుందనటంలో సందేహమే లేదు

Published Sat, Jul 4 2020 4:24 AM | Last Updated on Sat, Jul 4 2020 7:53 AM

YSRCP MPs Comments at media conference - Sakshi

లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ టికెట్‌తో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్న తీరుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం గురించి ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజుపై అనర్హత విధించాలని పిటిషన్‌ సమర్పించిన అనంతరం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.  

పార్టీ వ్యతిరేక చర్యల వల్లే పిటిషన్‌: విజయసాయిరెడ్డి 
► ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌కు సంబంధించి అన్ని విషయాలను పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామని సభాపతి హామీ ఇచ్చారు. ఆర్టికల్‌ 102 (2) ప్రకారం, పదో షెడ్యూల్‌ పేరా 2, సబ్‌ పేరా 1(ఏ) ప్రకారం అనర్హత పిటిషన్‌ తయారుచేసి స్పీకర్‌కు ఇచ్చాం.  
► ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది ఒక పునాది లాంటిది. రఘురామకృష్ణరాజు దానిని కదిలించేలా, ప్రజాస్వామ్యాన్ని కూలదోసేలా వ్యవహరించారు. ఆయన చర్యలు, మాట్లాడిన తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికై అందుకు అనుగుణంగా నడుచుకోకుండా క్రమశిక్షణను ఉల్లంఘించి అసభ్యకరంగా, అన్‌పార్లమెంటరీ పదాలతో మాట్లాడిన మాటలు, స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించిన తీరు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోనే ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేపథ్యంలో అనర్హత పిటిషన్‌ను ఫైల్‌ చేశాం.  
► ఆయనపై ఉన్న కేసులు గానీ, ఇతరత్రా ఏ లాభాపేక్షతో మిగతా పార్టీలతో కుమ్మక్కై ఆయన ఈ చర్యలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు.  
► పదో షెడ్యూలు ప్రకారం స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడం అంటే రాజీనామా చేయడం అని అర్థం కాదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల తీర్పులున్నాయి. సభ్యుడు తన ప్రవర్తన ద్వారా సభ్యత్వాన్ని వదులుకున్నట్టు చెప్పడమని న్యాయస్థానాల తీర్పులున్నాయి.  
► రఘురామకృష్ణరాజు విషయంలో రాజకీయ, వ్యక్తిగత ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించేలా ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇతరులను విమర్శించడం, పార్టీని దూషించడం కారణంగా ఆయనకు ఈ చట్టం వర్తిస్తుందనడంలో అనుమానం లేదు.  
► ధిక్కరణ అనేది క్రమశిక్షణ ఉల్లంఘనే. పార్టీ నాయకత్వం గురించి ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆ వ్యాఖ్యల విషయంలో ప్రజలు కూడా నిర్ణయిస్తారు. 

కోవర్టు రాజకీయాలు: చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ 
► మా పార్టీ నుంచి లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన లేఖ ఆధారంగానే రఘురామకృష్ణరాజుకు పదవి వచ్చిన విషయం వాస్తవం కాదా? టీటీడీ భూముల విషయంలో తెలుగుదేశం హయాంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు?  
► ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు.  
► రఘురామకృష్ణరాజు ఇంగ్లీష్‌ మీడియం గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. మాతృభాషను కాపాడుకుంటూనే పేద పిల్లల ఉన్నతిని కాంక్షించి ముఖ్యమంత్రి దూరదృష్టితో ఇంగ్లీష్‌ మీడియం తెచ్చారు.  
► పార్టీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీని దూషించడం లేదని చెబుతూనే ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి ఆయన చేసిన నిర్వాకం ఏమిటో ప్రజలు గమనించారు. త్వరలోనే ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయం. 

విలువను కాపాడుకోలేకపోయారు: పీవీ మిథున్‌రెడ్డి 
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం ఇచ్చారు. తొలిసారి ఎంపీ అయినా ప్రాధాన్యం, విలువ ఇచ్చారు.  
► నాలుగుసార్లు ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, రెండుసార్లు ఎంపీ అయిన బాలశౌరి, వంగా గీత లాంటి సీనియర్లు ఉన్నా రఘురామకృష్ణరాజు కోరిన వెంటనే సబార్డినేట్‌ లెజిస్లేటివ్‌ కమిటీ చైర్మన్‌గా ప్రతిపాదన ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడంతో సభాపతిని అభ్యర్థించాం.  
► టీటీడీ భూములు అమ్మాలని టీడీపీ, బీజేపీ హయాంలో నిర్ణయం తీసుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు ఏరోజూ ప్రశ్నించలేదు. ఈరోజు ఒక అంగుళం భూమి కూడా అమ్మకున్నా తానేదో అడ్డుకున్నట్టు టీవీ చర్చల్లో చెప్పారు. ఇచ్చిన విలువను, గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోయారు.  
► టీడీపీ ప్రోత్సాహం, బీజేపీలోకి వలస వెళ్లిన నేతల ప్రోద్బలంతో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. షోకాజ్‌ నోటీస్‌కు ఆయన ఇచ్చిన జవాబు కూడా సరైన పద్ధతిలో లేదు. ► టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీయేనని, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీయేనని, వైఎస్సార్‌సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అనే విషయం అందరికీ తెలుసు. ఉప ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. 

ఏం సాధించారు?: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు 
► అధినాయకత్వం, పార్టీ ఎమ్మెల్యేలతో వివాదాలు పెట్టుకుని తనకు ఓటు వేసిన ప్రజలకు ఏమీ చేయలేని స్థితిలో రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఈ వివాదాలతో ఆయన సాధించింది ఏమిటో ప్రశ్నించుకోవాలి. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి సొంతంగా పోటీ చేయాలి. 

కోవర్టు రాజకీయాలు: చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ 
► మా పార్టీ నుంచి లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన లేఖ ఆధారంగానే రఘురామకృష్ణరాజుకు పదవి వచ్చిన విషయం వాస్తవం కాదా? టీటీడీ భూముల విషయంలో తెలుగుదేశం హయాంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు?  
► ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు.  
► రఘురామకృష్ణరాజు ఇంగ్లీష్‌ మీడియం గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. మాతృభాషను కాపాడుకుంటూనే పేద పిల్లల ఉన్నతిని కాంక్షించి ముఖ్యమంత్రి దూరదృష్టితో ఇంగ్లీష్‌ మీడియం తెచ్చారు.  
► పార్టీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీని దూషించడం లేదని చెబుతూనే ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి ఆయన చేసిన నిర్వాకం ఏమిటో ప్రజలు గమనించారు. త్వరలోనే ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయం. 

సొంత బొమ్మతో గెలవాలి: నందిగం సురేష్‌ 
► సొంత టాలెంట్‌తో గెలిచానంటున్న రఘురామకృష్ణరాజుకు అంత నమ్మకముంటే రాజీనామా చేసి సొంత బొమ్మతో గెలవాలి. సాకులు చెప్పకుండా రాజీనామా చేయాలి.  
► ఆయన ఇప్పటికే మూడు పార్టీలు మారారు. ఇప్పుడు వెళ్లబోయే పార్టీలో అయినా ఉంటారా? అనేది అనుమానమే.  
► కన్నతల్లి లాంటి పార్టీని విమర్శించడం తగదు. ఆయనది ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీవైపు దొంగచూపులు చూసే బుద్ధి. బ్యాంకులకు ఎగనామం పెట్టి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారంతా తమతో కలసిపోవాలని ఆయన్ను ఆహ్వానిస్తున్నారు.  
► టీడీపీతో కుమ్మక్కై పార్టీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయనకు ఇబ్బంది కలిగించే విషయాలు త్వరలో బయటకు రాబోతున్నాయి కాబట్టి టీడీపీ సహకారంతో బీజేపీ వైపు వెళ్తే బయటపడతానని అనుకుంటున్నారు. 

సభాపతిదే నిర్ణయం...
పార్టీ షోకాజ్‌ నోటీస్‌ను సవాల్‌ చేస్తూ రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించారని విలేకరులు పేర్కొనటంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ అన్ని ప్రొసీజర్స్‌ అనుసరించే షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశామని వివరించారు. ‘స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌ అందచేశాం. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా స్పీకర్‌కే ఉంటుంది. స్పీకర్‌ తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనే అంశాలను కోర్టులు పరిశీలిస్తాయి’ అని చెప్పారు. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ కూడా వ్యవహరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.  

అనర్హత వేటు విధించండి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అనుసరించి అనర్హత వేటు విధించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీల బృందం శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు పిటిషన్‌ను అందచేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరించిన తీరుకు పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలో అనర్హత కచ్చితంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్, లోక్‌సభాపక్ష ఉపనేత నందిగం సురేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కూడిన ఎంపీల బృందం సభాపతిని కలిసింది. మార్గాని భరత్‌ ఈ మేరకు సభాపతికి పిటిషన్‌ను సమర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement