
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలిశారు. దాయాది పాకిస్తాన్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని ఆయనను కోరారు. జాలర్లతో వారి కుటుంబసభ్యులు మాట్లాడేందుకు దౌత్య అనుమతి ఇప్పించాలని కేంద్రమంత్రిని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి గుజరాత్ వెళ్లిన 21 మంది మత్స్యకారులు అరేబియా సముద్రంలో పాకిస్థాన్ గస్తీ దళాలకు చిక్కిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కొంతమంది జాలర్లు గుజరాత్‌లోని వారావల్ ప్రాంతానికి బతుకుదెరువు కోసం వెళ్లారు. అక్కడి నుంచి మత్స్యకారులు చేపల వేటకోసమని నాలుగు మెక్‌నైజ్డ్ బోట్లలో పయనమై అరేబియా సముద్రంలోకి వెళ్లారు. అందులో మూడు బోట్లు చేపల్ని వేటాడుతూ పొరపాటున భారత సరిహద్దులు దాటి పాక్ జలాల్లోకి ప్రవేశించాయి. దీన్ని గుర్తించిన పాక్ కోస్టుగార్డులు వెంటనే ఆయా బోట్లలోని జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈ అంశాన్ని పలుసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.