
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి చాలా హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో ఐజయ్య విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడి జరిగినపుడు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. సెల్ఫీ కోసం వచ్చి రెప్పపాటులో కత్తితో దాడి చేసి చంపాలని ప్రయత్నించాడని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన వెంటనే నన్ను కొట్టొద్దు, పోలీసులకు అప్పగించండి అని మాత్రమే నిందితుడు అన్నాడని పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై ఎవరూ దాడి చేయవద్దు.. పోలీసులకు అప్పగించండని మాత్రమే ఆ సమయంలో వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. ఎయిర్‌పోర్టులో ప్రథమ చికిత్స అనంతరం టీటీ వేయించుకుని వైఎస్ జగన్ హైదరాబాద్ వెళ్లారని స్పష్టం చేశారు.
చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరం
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి జరిగిన తర్వాత వైఎస్ జగన్ పక్క రాష్ట్రం వెళ్లిపోయారని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయారు కానీ జగన్‌కు హైదరాబాద్‌కు వెళ్లడానికి ఎలాంటి భయం అవసరం లేదని వ్యాఖ్యానించారు.
విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం ముఖ్యమంత్రి మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని ఐజయ్య పేర్కొన్నారు. జగన్‌పై జరిగిన దాడిని స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment