
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్న ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుపట్టింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో తేల్చకుండా ఆ బాధ్యతను తమపైకి నెట్టేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో తాము ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటన ఎన్‌ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టంగా తెలియచేస్తూ సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థ అని, ఆ మేర కేంద్ర హోంశాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జగన్‌పై హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్ సీల్డ్ కవర్‌లో ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం, ఇందులో తాము కోరిన వివరాలు లేవంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘జగన్‌పై హత్యాయత్నం ఘటన ఎన్‌ఐఏ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందా?రాదా? తేల్చేందుకు మూడు మార్గాలున్నాయి.
ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకోవడం ఒకటి. ఇతర మార్గాల ద్వారా అందిన సమాచారం రెండోది. కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా సమాచారం తెప్పించుకోవడం మూడోది. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా సమాచారం అందినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే’ అని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం తీసుకోకుండా దానిని ఇతరులపైకి నెట్టడం సరికాదంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ స్పందిస్తూ, కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతానని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఏం చేయాలో చెప్పేందుకు తామేమీ సలహాదారులం కాదంది. ఎన్‌ఐఏ చట్ట ప్రకారం ఈ మొత్తం వ్యవహారంపై నిర్ణయం తీసుకుని దానిని సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలంది.
Comments
Please login to add a commentAdd a comment