
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబు, లోకేష్‌లు రహస్యంగా వందల జీఓలు విడుదల చేశారని విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యలయంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎంత వయస్సు వచ్చింది అనేది కాదు.. ఎంత బుద్ది వచ్చిందనేది ఆలోచించాలని హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పునిహితో అనే వ్యక్తి సైతం టీడీపీ హయాంలో ఏపీలో పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయని, దీనికంటే బిహార్ ఎంతో నయం అని వ్యాఖ్యలు చేశారని ప్రస్తావించారు. అవినీతి ద్వారా రాష్ట్రంలో సంపాదించిన డబ్బంతా ప్రయాణాల పేరుతో విదేశాలకు తరలించారని ఆరోపించారు. చంద్రబాబు రూ. 6,17,585.19 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని వైఎస్సార్‌సీపీ పుస్తకం కూడా విడుదల చేసిందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా ఒక నివేదిక ఇచ్చిందన్నారు .అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై విచారణ చేయాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లకు లేఖ రాస్తానన్నారు.
ఆమె మాట్లాడుతూ.. ‘మొదటినుంచి బాబు అవినీతి పరుడే. ఆయన అవినీతిపై అప్పటి విపక్షాలు కూడా పోరాటం చేశాయి. చంద్రబాబు అవినీతి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని నేనే. గతంలో ఆయనపై కేసు కూడా వేశాను. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఏకంగా ప్రధానమంత్రి సైతం వ్యాఖ్యనించారు. చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, గవర్నర్, ప్రధానమంత్రికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నాను. చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో కేసు నడుస్తోంది. పోలవరంపై వైఎస్సార్‌ర్‌సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్తే రూ. 800 కోట్లు ఆదా అయ్యింది. అంత చిన్న అంశంపై ఇంత మిగిలితే.. మిగిలిన అంశాల్లో బాబు దోపిడి ఎంత ఉందో అర్ధం చేసుకోవాలి.. ఇన్ని దోపిడీలు చేసి మీరు ఎలా తిరుగుతున్నారు మీపై చర్యలు ఉండవా’ అని బాబును ప్రశ్నించారు.
ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్.. ఐదు నెలల్లో ఇంత పారదర్శకపాలన దేశంలో ఎక్కడ జరిగిందో చూపించాలని లక్ష్మీపార్వతి వారికి సవాలు విసిరారు. అవినీతిపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ గూడు కట్టుకున్నారని, ఐదు నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారని ఆమె తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని అన్నారు.
ప్రజలు తిరస్కరించినా బాబుకు బుద్ది రాలేదు.
చంద్రబాబు దెయ్యంలా ప్రవర్తిస్తున్నారని, గతంలో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి మోసం చేశారని విమర్శించారు. తమ ఓట్లతో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ది రాలేదని, రాజకీయాలకు బాబు చీడపురుగు అని వ్యాఖ్యనించారు. మొదట ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి పాలనను అందించారని.. నేడు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ రాజ్యం దిశగా పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే ముఖ్యమంత్రి అధిక పొదుపు చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం జగన్ ప్రకటించడం నిరుద్యోగులకు పండగ వంటిదని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యసేవలు అందేలా చేశారని అన్నారు. ఆటోడ్రైవర్లకు పదివేల రూపాయలు అందించారని సీఎం జగన్ పాలనను ప్రశంసించారు.
విషవృక్షం కింద నిలబడ్డావు
దోపిడి దొంగలతో చేరి నీతులు చెబుతావా అంటూ జనసేన అధక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆమె ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ నీ ఆదర్శం ఏంటో చెప్పాలని, కనీసం నువ్వు చేసే పని నీకైనా అర్థం అవుతుందా అని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. ‘రెండు సీట్లలో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయావు. నీవు వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయననే విమర్శిస్తావు. సీఎం జగన్ ను చూసి నేర్చుకో. ఆయన వన్ మెన్ ఆర్మీలా ఉన్నారు. అందుకే ప్రజలు నమ్మి అధికారం అందించారు. అదే నాయకత్వం అంటే. అవినీతి చక్రవర్తి చంద్రబాబుతో పవన్ దోస్తీ సరికాదు. నీవు విషవృక్షం కింద నిలబడ్డావు. నీవు ఎప్పటికీ ఎదగలేవు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించిన వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. ప్రజలను మాత్రమే నమ్మాడు. నదులు నిండిపారుతున్నాయి. ఎవరు నిజమైన నాయకుడో ప్రకృతే చెప్పింది. ఇలాంటి పరిస్దితిలో ఇసుక తీయడం సాధ్యమేనా. ఇసుక మా వాళ్లు దోపిడీ చేస్తున్నారా.. ఒక్కరినైనా పట్టివ్వు నీవు చేప్పేది వాస్తవమో కాదో తెలిసిపోతుంది.‘ అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.