
సాక్షి, వరంగల్ రూరల్: పరిషత్ ఎన్నికల్లో కారు జోరుకు ఇతర పార్టీలు బ్రేక్‌లు వేయలేకపోయాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ అన్ని స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టించింది. ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువుచేశాయి. విపక్ష పార్టీలు టీఆర్‌ఎస్‌ను మాత్రం ఢీకొనలేకపోయాయి. డిసెంబర్, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అదే జోరు పరిషత్ ఎన్నికల్లో కోనసాగింది. బ్యాలెట్‌లో సైతం టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. జిల్లాలో మూడు దశలల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. మే 6, 10, 14వ తేదిల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
మూడు విడతలల్లో 4,89,861 ఓట్లకు గాను 3,89,869 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16 జెడ్పీటీసీ స్థానాలకు 131 మంది, 171 ఎంపీటీసీ స్థానాలకు 778 మంది పోటీ చేశారు. జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయా కేంద్రాల్లో కౌంటింగ్‌ను నిర్వహించారు. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, గీసుకొండ, సంగెం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ వరంగల్ ఖమ్మం రోడ్‌లోని గణపతి ఇంజనీరింగ్ కళాశాల, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు సంబంధించినవి నర్సంపేట మహేశ్వరంలోని బాలాజీ స్కూల్, పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాలకు సంబంధించినవి పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కలిపి 1,282 టెబుల్‌లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేశారు.
16కు 16 టీఆర్‌ఎస్‌వే
వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 16 జెడ్పీటీసీ స్థానాలకు 131 మంది పోటీ చేశారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులే గెలుపొందారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఇతర పార్టీలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయాయి. 16 స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కడంతో ఇక చైర్‌పర్సన్ ఎన్నిక సులభతరం కానుంది. ఇతర పార్టీల నుంచి ఎవరు గెలుపొందకపోవడంతో టీఆర్‌ఎస్‌కే జెడ్పీ పీఠం దక్కనుంది.
127 స్థానాల్లో టీఆర్‌ఎస్
జిల్లాలో మూడు దశలల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. 178 ఎంపీటీసీ స్థానాలుండగా 7 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 171 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 778 మంది పోటీ చేశారు. 178 స్థానాల్లో 127 టీఆర్‌ఎస్, 45 కాంగ్రెస్, 6 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీకి స్థానం కూడా దక్కలేదు. నర్సంపేట, గీసుకొండ మండలాల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. ఈ రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీనే ఎంపీపీలు దక్కించుకునే అవకాశాలున్నాయి. మిగతా అన్ని మండలాలల ఎంపీపీలను టీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశాలున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment